Jagan full Clarity on Tirumala Laddu Issue : తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని..కల్తీ నెయ్యిని గత పభుత్వం వాడిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ ఖండించారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని.. జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాజకీయ దుర్భుద్ధితోనే లడ్డూ విశిష్టతను దెబ్బ తీశారు
గత వారం రోజులుగా తిరుమల లడ్డు పై జరుగుతున్న వివాదం పై జగన్ స్పందించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని జగన్ విమర్శించారు. ‘రాజకీయ దుర్బుద్ధితోనే లడ్డూ విశిష్టతను సీఎం దెబ్బతీశారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు. జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అంశం తీసుకొచ్చారు అంటూ జగన్ పేర్కొన్నారు.
దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలకు నోటీసులిచ్చి అడ్డుకున్నారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా? అని జగన్ ప్రశ్నించారు. నేను తిరుమలకు వెళ్తానంటే వేలాది మంది పోలీసులను మోహరించారు. లడ్డూ వివాదంలో డైవర్షన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారని జగన్ వాపోయారు.
టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్
తిరుమలలో నెయ్యి కొనుగోలు టెండర్లు ప్రతి 6 నెలలకోసారి, L1గా వచ్చిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తారని జగన్ వెల్లడించారు. ‘TTDలో తప్పు చేయడానికి వీల్లేని వ్యవస్థలు ఉంటాయి. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే నిర్ణయాలు తీసుకుంటారు. NABL సర్టిఫికెట్లతో వచ్చిన నెయ్యి ట్యాంకర్లకు TTD 3 రకాల పరీక్షలు చేస్తుంది. ఒక్క దానిలో ఫెయిలైనా ట్యాంకర్ను వెనక్కి పంపుతారు. ఇదంతా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే’ అని పేర్కొన్నారు. తమ హయాంలో నెయ్యి క్వాలిటీగా లేదని 18 ట్యాంకర్లు వెనక్కి పంపామని జగన్ గుర్తుచేశారు. ‘జులై 6, 12 తేదీల్లో 4 ట్యాంకర్లు వచ్చాయి. అవి TTD టెస్టుల్లో ఫెయిల్ అవడంతో వెనక్కి పంపారు. టెస్టులు ఫెయిల్ అయితే మైసూర్ ల్యాబ్ కు పంపుతారు. కానీ మొదటిసారిగా ఈ శాంపిల్స్ ను గుజరాత్ కు పంపారు. 2 నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్ కలిసిందని సీఎం చెప్పారు. ఆ తర్వాతి రోజు TDP ఆఫీసులో రిపోర్టును బయటపెట్టారు’ అని విమర్శించారు.
డైవర్ట్ పాలిటిక్స్
నందిని నెయ్యిని వైసీపీ హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్ ను ఎందుకు కొనుగోలు చేయలేదు..? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది..? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’ అని జగన్ పేర్కొన్నారు.
అన్ని మతాలను గౌరవిస్తా
తన తండ్రి వైఎస్సార్ ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని..’ఏడుకొండలవాడి ఆశీస్సులతోనే నా పాదయాత్ర ప్రారంభించా. యాత్ర ముగిశాక కాలినడకన కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నా. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా..? నేను సీఎం హోదాలో ఐదుసార్లు వస్త్రాలు సమర్పించా. 10-11 సార్లు వెళ్లిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో అడ్డుకుంటామని నోటీసులు ఇస్తారా..? అని మండిపడ్డారు. తన కులం, మతం గురించి రాష్ట్రంలో ఎవరికీ తెలియదా..? అని జగన్ ప్రశ్నించారు. ‘నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా. తప్పేముంది..? బయటకు వెళితే హిందూ సంప్రదాయాలను, ఇస్లాం, సిక్కు మతాలనూ అనుసరిస్తా. గౌరవిస్తా. నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకోండి. సెక్యులర్ దేశంలో గుడికి వెళ్లే వ్యక్తి మతం గురించి అడుగుతారా..? ఇలాంటి పరిస్థితి ఉంటే దళితులు ఆలయాల్లోకి వెళ్లగలరా..?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్
మానవత్వం చూపేదే హిందూ మతమని, మానవత్వం చూపనివాళ్లు తాము హిందువని చెప్పుకోలేరని జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ‘తిరుమల గొప్పదనాన్ని, లడ్డూ విశిష్టతను చంద్రబాబే నాశనం చేశారు. నన్ను గుడికి పంపినా, పంపకపోయినా చంద్రబాబు చేసిన పాపం ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో పూజలు నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు.
Read Also : Ravichandran Ashwin: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు