వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన నెల్లూరులో కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి కొండయ్యపాలెం గేట్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలోని ఆయన నివాసంలోకి ప్రవేశించిన దుండగులు ఫర్నిచర్‌తో సహా ఇంటి లోపలి వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. ఈ దాడికి గల అసలు ఉద్దేశం హత్యాప్రయత్నమేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ దాడికి కొద్ది గంటల ముందు ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరులో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై విమర్శలు చేసిన తర్వాతే ఈ దాడి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ ఘటనకు రాజకీయ కోణం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. సమాచారం అందుకున్నప్పటికీ, పోలీసులు అక్కడికి చేరేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
India- Brazil: బ్రెజిల్‌తో భారత్ మూడు కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
ఈ దాడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలనను దుర్మార్గ పాలనగా విమర్శించిన జగన్, రాష్ట్రంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు కొనసాగుతున్నాయని జగన్ విమర్శించారు. ఈ దాడిలో ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి కూడా భయబ్రాంతులకు గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ నేతలపై కుట్ర చేస్తుందని జగన్ అన్నారు. టీడీపీకి చెందిన రౌడీలే పోలీసుల సమక్షంలో ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై ఇది భయంకరమైన దాడి అని పేర్కొన్న జగన్, ఇటువంటి హింసాత్మక చర్యలతో ప్రజల గొంతు నొక్కలేరు అని స్పష్టం చేశారు.