Undavalli: జగన్ గ్యాంబ్లింగ్ సీఎం..ఏపీలో పవన్ ఎఫెక్ట్ పక్కా..ఉండవల్లి కీలక వ్యాఖ్యలు..!!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్....ఏపీ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి. సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసే వ్యాఖ్యలు సర్వత్రా ఆకర్షిస్తుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్….ఏపీ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలి. సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసే వ్యాఖ్యలు సర్వత్రా ఆకర్షిస్తుంటాయి. అంతేకాదు ఆయన ప్రెస్ మీట్ పెడితే కొన్నాళ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పథకాల పేరుతో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు డబ్బులిచ్చాను కాబట్టి…వాళ్లు నాకు ఓటు వేయాలన్నదే జగన్ విధానమన్నారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఓటు వేయనివారికి పథకాలు ఇవ్వరన్నారాయన. ఇదే ఫార్ములాలో జగన్ సఫలం అవుతారా..విఫలం అవుతారా అనేది ఎవరూ చెప్పలేరన్నారు. రాజకీయాల్లో ఇటువంటి గ్యాంబ్లింగ్ ను ఎవరూ చేయలేదన్నారు. పథకాలకు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్రం నిధులు దుర్వినియోగం చేసిందని చెప్పినా…పేదలకు ఇచ్చానని చెప్తారు తప్ప జగన్ అస్సలు ఫీలవరన్నారు.

దివంగత నేత, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కూడా ఉండవల్లి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైఎస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని…ఆయనతోపాటు 30మంది సేల్స్ మెన్ ఉంటే..ఆయన చీఫ్ సెల్స్ మెన్ అని…ఆయన దగ్గరకు వచ్చినవారు వేరేవాళ్ల వద్దకు వెళ్లకుండా చూసుకునే వారని చెప్పారు. ప్రజలతో రెండోసారి ఓటు వేయించుకుని ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తుచేశారు. కానీ వైసీపీ అలాంటి పరిస్థితి లేదని…అక్కడ సర్వం జగన్ మోహనేనని..పక్కా వ్యాపారం నడుపుతున్నారన్న ఉండవల్లి లాభమున్న పనులను మాత్రమే జగన్ చేస్తారని విమర్శించారు.

ఇక రానున్న ఎన్నికలపై కూడా ఉండవల్లి స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందన్నారు. అయితే ఎవరి కలిసివస్తుందన్నది మాత్రం చెప్పలేమన్నారు. ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో రాజకీయశక్తులు మళ్లీ కలుస్తాయని చెప్పారు. కులాల మధ్యే యుద్దం జరుగుతోందన్న ఉండవల్లి…బ్రదర్ అనిల్ పార్టీపై కూడా వ్యాఖ్యలు చేశారు. తనకు సాన్నిహిత్యంతోనే తనను కలిశానని..అందులో ఎలాంటి రాజకీయాంశానికి తావు లేదని చెప్పారు.

పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు….గందరగోళం చేసిన సీఎం ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల బాధ్యతలు తీసుకున్న చంద్రబాబును విమర్శించిన జగన్…తాను అధికారం చేపట్టాక కేంద్రానికి ఎందుకు అప్పగించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాదు అందుకే ఇక్కడ డబ్బులు ఖర్చు చేయడానికి ముందుకు రావడంలేదన్నారు. ఢిల్లీకి వెళ్లనప్పుడు ప్రధానమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ప్రత్యేక హోదా గురించి జగన్ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.

  Last Updated: 16 Apr 2022, 09:33 AM IST