ప్రాంతీయ బోర్డు చైర్మ‌న్లుగా మాజీ మంత్రులు?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పరిపాల‌న సంస్క‌ర‌ణ‌ల‌ను వేగ‌వంతం చేస్తున్నారు

  • Written By:
  • Updated On - April 21, 2022 / 02:55 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పరిపాల‌న సంస్క‌ర‌ణ‌ల‌ను వేగ‌వంతం చేస్తున్నారు. ఇప్ప‌టికే 26 జిల్లాల‌ను ఏర్పాటు చేసిన ఆయ‌న ఈనెలాఖ‌రులోగా ప్రాంతీయ మండ‌ళ్ల కూర్పును పూర్తి చేయ‌బోతున్నారు. మంత్రివ‌ర్గంలో స్థానం కోల్పోయిన వాళ్ల‌కు ప్రాంతీయ మండ‌ళ్ల చైర్మ‌న్లుగా నియమించ‌నున్నారు. మంత్రుల‌కు స‌మాంత‌రంగా ప‌వ‌ర్స్ ఉండేలా ప్రాంతీయ మండ‌ళ్ల చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను క్రియేట్ చేయ‌డానికి కస‌ర‌త్తు చేస్తున్నారు.కొత్త జిల్లాల ప్రాతిప‌దిక‌గా తీసుకుని ప్రాంతీయ బోర్డుల‌కు ప‌రిధుల‌ను నిర్ధారించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మొత్తం 26 జిల్లాల‌కు ఆరు బోర్డులను ఏర్పాటు చేస్తార‌ని ప్రాథ‌మికంగా అందుతోన్న స‌మాచారం. ఒక్కో బోర్డుకు క్యాబినెట్ హోదాలో ఉండే చైర్మ‌న్ తో పాటు ఆయా జిల్లాల ఇంచార్జిలు, రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్లు స‌భ్యులుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రుల సమ‌క్షంలో నిరంత‌రం స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని భావిస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలు, విశాఖ కు ప్రత్యేకంగా , గోదావరి జిల్లాలతో కలిపి ఒక మండలి, క్రిష్ణా, గుంటూరు జిల్లాల తో ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. అదే విధంగా ప్రకాశం – నెల్లూరు జిల్లాలతో మరో బోర్డు తో పాటుగా రాయలసీమలో రెండు బోర్డులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ప్రాధాన్యతలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన ఈ బోర్డులు కీలకంగా మారనున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ బోర్డులను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ సాగుతోంది.ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు, కేబినెట్ విస్తరణ, ఇంఛార్జ్ మంత్రుల నియామకం, వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్ల నియామ‌కాలు పూర్తి కావటంతో ఇప్పుడు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు పై గురిపెట్టారు.జ‌గ‌న్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేసింది. న్యాయ పరమైన సమస్యలతో మూడు రాజధానులు ఆచరణ అమలు కాలేదు. కానీ, ప్రభుత్వం మూడు రాజధానుల దిశ‌గా అడుగులు వేస్తూ అధికార వికేంద్ర‌క‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అధికార వికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అన్ని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రలను నియమించారు. పార్టీ పరంగానూ ప్రతీ జిల్లాకు అధ్యక్షుడు ప్రాంతీయ సమన్వయకర్తలను ఖరారు చేసారు. ఇప్పుడు ప్రాంతీయ‌ మండళ్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.

ప్రాంతీయ మండ‌ళ్ల ఛైర్మన్లుగా సీనియర్ నేతలకు అవకాశం ఉండ‌నుంది. మొత్తం 26 జిల్లాలకు అయిదు నుంచి ఆరు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి హోదా కట్టబెడుతూ ప్రాంతీయ మండలి ఛైర్మన్లను నియమించనున్నారు. అదే విధంగా ప్రాంతీయ మండలి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఆశించి రాని వారు, తొలి నుంచి పార్టీలో ఉన్న వారికి ఛైర్మన్లుగా అవ‌కాశం రానుంద‌ని తెలుస్తోంది.. పార్టీ కోసం నిలబడిన వారికి సభ్యులుగా అవకాశం కల్పించనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద అధికార వికేంద్ర‌క‌ర‌ణ రూపంలో రాజ‌కీయ నిరుద్యోగాన్ని త‌గ్గించే దిశ‌గా జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌న్న‌మాట‌.