AP Politics : జ‌గ‌న్ కు చెల‌గాటం,బాబు ప్రాణ‌సంక‌టం!

`కుక్క పిల్ల‌, స‌బ్బు బిళ్ల‌..రాజ‌కీయాల‌కు ఏదీ అన‌ర్హం కాదు..` అంటూ ఒక తెలుగు సినిమాలోని పాపుల‌ర్‌ డైలాగు.

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 02:30 PM IST

`కుక్క పిల్ల‌, స‌బ్బు బిళ్ల‌..రాజ‌కీయాల‌కు ఏదీ అన‌ర్హం కాదు..` అంటూ ఒక తెలుగు సినిమాలోని పాపుల‌ర్‌ డైలాగు. దేన్నైనా రాజ‌కీయం చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌ని రోజులివి. గోదావ‌రిలో ప‌డిన తెలుగుదేశం పార్టీ నేత‌ల ప్రాణాపాయంపై వ్యంగ్యాస్త్రాల‌తో కూడిన పోస్టుల‌ను ప్ర‌త్య‌ర్థులు సోషల్ మీడియా వేదిక‌గా షేక్ చేశారు. స‌హాయం అంద‌క చీక‌ట్లోనే భ‌య‌భ‌యంగా కాలం గడుపుతోన్న వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్లిన లీడ‌ర్ల ప‌డ‌వ బ్యాలెన్స్ త‌ప్పింది. దీంతో మాజీ మంత్రి ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో పాటు ప‌లువురు లీడ‌ర్లు గోదావ‌రిలో ప‌డిపోయారు. వెంట‌నే అక్క‌డున్న జాల‌ర్లు క్షేమంగా వాళ్ల‌ను గ‌డ్డుకు తీసుకొచ్చారు. తృటిలో ప్రమాదం త‌ప్పింద‌ని, ఊపిరాడ‌ని స్థితికి వెళ్లాన‌ని ఉమ స్పందించారు.

రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా నీటిలో అకస్మాత్తుగా అందరూ పడిపోయారు. ప్రమాద సమయంలో లాంచీలో చంద్రబాబు సహా 15 మంది ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు సహా అందరూ నీటిలో తడిసి ముద్దయ్యారు. మానేపల్లి వరదల సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై త‌క్షణ‌మే స్పందించిన మ‌త్స్యకారులు టీడీపీ నేత‌ల‌ను న‌దిలో నుంచి సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇదీ గురువారం రోజున చంద్ర‌బాబు టూర్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌.

గోదావ‌రి, కృష్ణా న‌దుల మ‌ధ్య ఉండే లంక గ్రామాల‌కు వెళ్లాలంటే ప‌డ‌వ మీద ప్ర‌యాణం చేయాలి. ఆ సంద‌ర్భంగా స‌హ‌జంగా ఎవ‌రైనా ప్ర‌త్యేక జాకెట్ల‌ను వేసుకుంటారు. అక్క‌డ ప‌డ‌వ‌లు న‌డిపే జాల‌ర్ల వ‌ద్ద జాకెట్లు ఉంటాయి. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన చంద్ర‌బాబు అండ్ టీమ్ రెండు ప‌డ‌వ‌ల్లో ఎక్కారు. వాళ్లంద‌రికీ గోదావ‌రిలో ప‌డిన‌ప్ప‌టికీ మున‌గ‌కుండా ఉండేలా జాకెట్ల‌ను తొడిగారు. ఆ త‌రువాత రెండు ప‌డ‌వ‌ల క‌దులుతోన్న స‌మ‌యంలో గుద్దుకోవ‌డం జ‌రిగింది. ఫ‌లితంగా చంద్ర‌బాబు ఎదుట ఉండే ప‌డ‌వ ప‌క్క‌కు ఒరిగడంతో లీడ‌ర్లు గోదాట్లో ప‌డ్డారు. స‌రిగ్గా ఇక్క‌డే ప్ర‌త్య‌ర్థి పార్టీలు తొడిగిన జాకెట్ల‌ను రాజ‌కీయం చేశారు. ముందుగా జాకెట్లు వేసుకున్న‌ప్పుడే ఇదేదో డ్రామా చేస్తార‌ని ఊహించామ‌ని ప్ర‌త్యర్థులు పెట్టిన పోస్టులు, ట్రోలింగ్స్. ప్ర‌తిగా ఐటీడీపీ పోస్టులు అటాక్ చేయ‌డం జ‌రిగిపోయింది. మొత్తం మీద చంద్ర‌బాబు వ‌ర‌ద బాధితుల కోసం చేస్తోన్న ప‌ర్య‌ట‌న‌ను జాకెట్ల చుట్టూ తిప్ప‌డంతో వైసీపీ సోష‌ల్ మీడియా స‌క్సెస్ అయింది.

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో శుక్ర‌వారం పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గురువారం రాత్రి పాలకొల్లులో బస చేసిన చంద్రబాబుకు శుక్రవారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం ప్రాంతాల్లో ని వరద బాధితులను కలుసుకున్నారు. మధ్యాహ్నం నరసాపురం మండలం పొన్నపల్లిలో గోదావరి గట్టును పరిశీలించి, సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్క‌డ నుంచి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.

చంద్రబాబు గురువారం పర్యటనలో సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను బురదలో వదిలేసి ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం బాధితులకు రూ.10వేల చొప్పున ఇస్తోందన్న చంద్రబాబు ప్ర‌క‌టించారు. అదే, ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.2 వేలు అందిస్తోందని బాబు విమ‌ర్శించారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వ సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వ‌ర‌ద బాధితుల ప‌ట్ల జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా బాధితుల‌ను ఆదుకోవాల‌ని జ‌గ‌న్ కు సూచించారు. రెండో రోజు బాబు. ప‌ర్య‌ట‌న‌ను ఏదో ఒక ర‌కంగా పక్క‌దోవ ప‌ట్టించాల‌ని వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌య‌త్నం చేస్తోంది. ఏ విధంగా ఫోక‌స్ చేస్తుందో చూడాలి.