Kesineni Shivnath : వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. రాజధాని అమరావతికి నిధులు రాకుండా జగన్ బ్యాచ్ ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు నష్టం చేసే పనులను మానుకోవాలి అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. విదేశీ కంపెనీలపై ఆయన అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారు. వారికి మేం అండగా ఉంటాం.. నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రవాసాంధ్రులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని కేశినేని అన్నారు.
Read Also: BRS Silver Jubilee: ఒక ‘క్షతగాత్రుడి’ రజతోత్సవం !!
ఈ దేశం కోసం సేవ చేయడానికి వచ్చే ప్రవాసాంధ్రులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ ఆడించే డ్రామాలో భాగంగా ఆ పార్టీ ఉల్ఫా బ్యాచ్‌తో విభిన్న పాత్రలు పోషింపచేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. ఏపీ మీద, నిరుద్యోగ యువత మీద ఎందుకింత కక్షకట్టారో సమాధానం చెప్పాలని ఎంపీ కేశినేని శివనాథ్ డిమాండ్ చేశారు.
ప్రజలు బుద్ధి చెప్పిన వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. చేతనైతే తమపై నేరుగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు డ్రామా ఆర్టిస్టులతో ఆటలాడిస్తే తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఆఫీస్ అడ్రస్ కూడా లేని 21సూట్ కేసు కంపెనీలను పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇదిలాఉండగా, కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్న వారిపై ఇప్పటికే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.