వైసీపీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగలబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల ముందు , ఎన్నికల తరువాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కూటమి పార్టీలలో చేరిన సంగతి తెలిసిందే. ఈ తంతు ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada rao) వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ధర్మాన, వైసీపీలో చేరిన తరువాత 2019లో మంత్రి పదవిని కూడా పొందారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన పూర్తిగా రాజకీయాలకు విరామం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోవడం విశేషంగా నిలిచింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని 2024 ఎన్నికలకుముందే ధర్మాన కలిసినట్టు తెలుస్తోంది. అప్పట్లో తన రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. కానీ జగన్ సూచన మేరకు పోటీ చేసిన ధర్మాన, ఓటమి అనంతరం పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. శ్రీకాకుళం జిల్లా స్థాయి సమావేశం జరిగిన రోజున కూడా ఆయన అక్కడే ఉండి పాల్గొనకపోవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. దీని ద్వారా ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు పటిష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక ధర్మాన కుమారుడు ధర్మాన రామమోహన్ రావు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. కానీ ఆయన ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారన్నది మాత్రం ఇంకా తేలలేదు. జనసేనలోకి ధర్మాన కుటుంబం వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది జరిగితే శ్రీకాకుళం జిల్లాలో జనసేనకి బలమైన నాయకత్వం దక్కే అవకాశం ఉంది. మొత్తంగా, ధర్మాన తన బాధ్యతల్ని తన కుమారుడికి అప్పగించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆయన రాజకీయ నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది.