AP Assembly : ఏపీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని పట్టుబట్టారు.
Read Also: Marriage For Buffaloes : గేదెల కోసం మహిళ రెండో పెళ్లి.. షాకిచ్చిన అత్తామామలు
సభలో ఉన్నది రెండే పక్షాలని ఒకటి అధికారపక్షమైన కూటమి, రెండోది ప్రతిపక్షమని చెప్పారు. ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరితే ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్ చేసిందని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు.
ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూసిన తర్వాతే తమ తదుపరి చర్య ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళతామని, ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న తమపై కేసులు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీలపై ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. కాగా, ఈరోజు ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైసీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైయస్ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.
Read Also: AMGEN : హైదరాబాద్‌లో అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభం