Amaravati Politics: అమ‌రావ‌తిపై `మూడు` సంచ‌ల‌నాలు

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో రెండు కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగాయి. రాష్ట్రంలోని పేద‌లు ఎవ‌రైనా అమ‌రావ‌తిలో స్థ‌లాల‌ను పొందేందుకు అర్హులుగా గుర్తిస్తూ

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 01:39 PM IST

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో రెండు కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగాయి. రాష్ట్రంలోని పేద‌లు ఎవ‌రైనా అమ‌రావ‌తిలో స్థ‌లాల‌ను పొందేందుకు అర్హులుగా గుర్తిస్తూ గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ ఆమోద ముద్ర వేశారు. ఇత‌ర ప్రాంతాల పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించే వెసుల‌బాటు క‌ల్పిస్తూ సీఆర్డీయే చ‌ట్టం, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చ‌ట్టాల‌ను స‌వ‌రిస్తూ ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దానికి రాజ‌ముద్ర వేస్తూ గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని ఇటీవ‌ల ఆంధ్రప్ర‌దేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ స‌ర్కార్ వేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు విచార‌ణ‌కు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్ పీ)కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నంబర్ కేటాయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించే కేసుల జాబితాలో దీన్ని కూడా చేర్చాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు దాఖలు చేసిన ఎస్ ఎల్ పీపై విచారణ విషయంలో తమ వాదనలను కూడా వినాలని కోరుతూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నెల క్రితమే ఏపీ సర్కారు ఎస్ఎల్ పీ దాఖలు చేయడం గమనార్హం.

మ‌హాపాద‌యాత్ర సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల దాడుల‌పై లంచ్ మోష‌న్ పిటిష‌న్ ను అమ‌రావ‌తి రైతులు హైకోర్టులో దాఖ‌లు చేశారు. పాద‌యాత్ర చేయ‌కుండా దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో రాజ‌మండ్రి కేంద్రంగా జ‌రిగిన దాడుల‌ను ఆధారాల‌తో స‌హా కోర్టుకు అంద‌చేశారు. మొత్తం మీద పేద‌ల‌కు అమ‌రావ‌తిలో ఇళ్ల స్థ‌లాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం, ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి నినాదంపై సుప్రీం కోర్టు విచార‌ణ‌కు అనుమ‌తించ‌డం, మ‌హాపాద‌యాత్ర‌పై దాడుల అంశంపై హైకోర్టులో లంచ్ మోష‌న్ మూవ్ చేయ‌డం చూస్తే మూడు రాజ‌ధానుల‌కు రూట్ క్లియ‌ర్ అయ్యేలా క‌నిపిస్తోంది.