Vijay Sai Reddy : విజయసాయిరెడ్డి కథ అడ్డం తిరిగిందా? విశాఖ నుంచి విజయవాడకు మకాం ఎందుకు మారింది?

విశాఖలో అంతా తానై చక్రం తిప్పి, ఉత్తరాంధ్ర సీఎంగా అనిపించుకున్న విజయసాయిరెడ్డికి కథ అడ్డం తిరిగిందా? ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగేందుకేనా?

  • Written By:
  • Publish Date - April 3, 2022 / 11:34 AM IST

విశాఖలో అంతా తానై చక్రం తిప్పి, ఉత్తరాంధ్ర సీఎంగా అనిపించుకున్న విజయసాయిరెడ్డికి కథ అడ్డం తిరిగిందా? ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగేందుకేనా? అధినేత నిర్ణయంతో సడన్ గా విశాఖకు దూరంకాక తప్పడం లేదా? విశాఖ నుంచి పంపించేయడానికి భూ వివాదాలే కారణమా? ఈ పరిణామంతో ఇప్పటిదాకా అధికారానికి దూరంగా ఉన్నవారు లోలోన సంబరడిపోతున్నారా? మరి ఆయనను నమ్ముకున్నవారి పరిస్థితేంటి? విజయసాయిరెడ్డి అనుకున్నదొకటైతే.. అధినేత నిర్ణయంతో ఇపుడు అయ్యిందొకటా?

ఉత్తరాంధ్రలో పాగావేయాలనుకున్న విజయసాయిరెడ్డికి అధినేత షాకిచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసిన విజయసాయికి.. ఇప్పుడు అది ఎందుకూ పనికిరాకుండా పోయేలా ఉంది. ఆయన విషయంలో జగన్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన విశాఖకు దూరమైనట్టే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి..ఈ పరిణామాలు విజయసాయిరెడ్డి వ్యతిరేక వర్గానికి కలిసి వస్తాయా? అదే జరిగితే.. ఆయననే నమ్ముకున్న వారి పరిస్థితేంటి?

వైసీపీ అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అంతా తానే అన్నట్లుగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. మూడు జిల్లాల్లో విజయసాయిరెడ్డి హవాకు తిరుగులేకుండా పోయింది. రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో మంత్రి కంటే ఎక్కువుగా అధికారం చెలాయించారు. అధికారుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరించారని తెలుస్తోంది. దీంతో ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు తొలుత విజయసాయిరెడ్డి వ్యవహార శైలిని బాహాటంగానే వ్యతిరేకించారు. అలాంటివారికి అధినేత దగ్గర పంచాయితీ పెట్టించి, అక్షింతలు వేయించడంతో ఒక్కొక్కరుగా విజయసాయిరెడ్డికి సరెండర్ అవ్వడం పరిపాటయ్యిందని టాక్. ఇదేదో కొత్త రాజ్యాంగం అనుకుని ఎవరికివారు ఏమి చేయలేక, ఏమి అనలేక.. సైలెంట్ గా ఎవరిపనులు వారు చేసుకోవడానికి అలవాటు పడ్డారట. ప్రగతి భారతి ట్రస్ట్ పెట్టి ఎలాపడితే అలా.. ఫండింగ్ చేసినా మనకెందుకులే అన్న ధోరణిలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది.

ప్రజాక్షేత్రంలో గెలిచిన ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమాలను నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఎంపీ అయిన విజయసాయిరెడ్డి నిర్వహించడపై కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహించిన సందర్భాలున్నాయని విశాఖవాసులు అంటున్నారు. ఆయన ప్రజాదర్బార్ నిర్వహించడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందన్న గుసగుసలు వినిపించాయి. ప్రస్తుత ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణను పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీచేయాలనేది విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ గా ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యేoదుకే విజయసాయిరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించడం, ఆయా నియోజకవర్గాల్లో తనకంటూ ఓ టీమ్ ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారన్నదానిపై విశాఖలో జోరుగా చర్చ నడుస్తోంది.ఇందులో భాగంగానే క్రమం తప్పకుండా ప్రతి ఏడాది క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కూడా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసమే ఓ అడుగు ముందుకేసి ఇక్కడే స్థిరపడతానని, తన శేష జీవితాన్ని ఇక్కడే గడుపుతానని విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించారు.

విజయసాయిరెడ్డి వ్యవహారంలో బయటికి ఎలా వున్నా స్థానిక ప్రజాప్రతినిధులు లోలోపల ఇబ్బందిపడ్డారని వైసీపీ వర్గాలు అంటుంటాయి. ఎంత దాచిపెడదామనుకున్నా ఇదే విషయం అధినేత దగ్గరికి వెళ్లినట్టు సమాచారం. ప్రగతి భారతి ట్రస్ట్ పేరిట నిధుల సేకరణ, విజయసాయిరెడ్డి పేరు చెప్పి భూదందాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సంగతిపై అధిష్టానం దృష్టి పెట్టిందని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరగుతోంది. ఇదే కొనసాగితే కీలక ప్రాంతమైన ఉత్తరాంధ్రలో పార్టీ ప్రభావం మరింతగా తగ్గే అవకాశం ఉందన్న భావనతోనే విజయసాయిరెడ్డిని విజయవాడకు మార్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజం అన్నట్టుగా మూడు వారాలుగా విజయసాయిరెడ్డి విశాఖలో ఎక్కడా కనిపించలేదని టాక్.

ఆత్మాభిమానం ఎక్కువుగా ఉన్న ఉత్తరాంధ్రలో ఇటు పార్టీలో అటు పబ్లిక్ లో వైసీపీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే విజయసాయిరెడ్డిని విశాఖకు దూరంగా ఉంచాలని కొందరు పార్టీ నేతలు కోరారట. ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో పరిస్థితిని మెరుగుపర్చేందుకే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. మరి కొత్త క్యాబినెట్ కొలువైన తర్వాత ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఇంకా మారే అవకాశాలు కనిపిస్తున్నాని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.