Devineni Uma : దేవినేని ఉమకు చంద్రబాబు షాక్.. ఇండిపెండెంట్‌గా బరిలోకి ?

Devineni Uma : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు చంద్రబాబు షాకిచ్చారు.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 02:36 PM IST

Devineni Uma : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు చంద్రబాబు షాకిచ్చారు. ఆయనకు మూడో జాబితాలోనూ చోటు కల్పించలేదు.  ఉమ ఆశించిన మైలవరం అసెంబ్లీ టికెట్‌ను  ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు కేటాయించారు.మైలవరం టికెట్ ఇవ్వకుంటే.. కనీసం పెనమలూరులోనైనా తనకు అవకాశం కల్పిస్తారని దేవినేని ఉమ భావించారు. అయితే అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరును చంద్రబాబు ప్రకటించారు. తనకు టికెట్ ఇవ్వకుంటే చంద్ర‌బాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని అల్టిమేటం ఇవ్వడంతో పెన‌మ‌లూరు స్థానాన్ని అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి బోడే ప్ర‌సాద్‌కే కట్టబెట్టారు. దీంతో  ఇక దేవినేని ఉమకు నియోజకవర్గం అంటూ ఏమీ లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడ ఈస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని దేవినేని ఉమ భావిస్తున్నారట. ఇవాళ సాయంత్రం 5 గంటలకు జక్కంపూడి కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించనున్నారట. చంద్రబాబు, సీనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఉమ(Devineni Uma) ఓట్లు అడగనున్నారట. ఈవిషయాన్ని కాసేపట్లో కార్యకర్తల సమావేశంలో దేవినేని ఉమ ప్రకటిస్తారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

దేవినేని ఉమ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచీ ఆయన టీడీపీలోనే ఉన్నారు. టీడీపీకి బలమైన గొంతుకగా నిలబడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా ఉమ ఏమాత్రం భయపడకుండా అధికార పార్టీపై పోరాటం చేశారు. అటువంటి దేవినేని ఉమను పక్కన పెట్టడమంటే బలమైన కారణం ఉండి ఉంటుందన్న కామెంట్స్ పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమకు చివరకు ఈసారి సీటు లేకుండా పోయిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :Hyderabad Daredevils : తల్లీకూతుళ్ల తడాఖా.. తుపాకీ, కత్తితో వచ్చిన దొంగలు పరార్!

ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాపై నమ్మకం ఉంచి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరేలా నియోజకవర్గంలోని ప్రతిఒక్క నాయకుడిని, కార్యకర్తలను సమన్వయపరుస్తూ నా ప్రయాణం కొనసాగిస్తా’’ అని వసంత కృష్ణ ప్రసాద్ ట్విటర్ వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ కొత్తగా మరో11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక కేవలం 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచింది.

Also Read :Eating With Hand: ఏంటి.. చేతితో భోజనం చేయడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?