TDP@NDA: ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లే వేళాయే!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు, ప్ర‌ధాని మోడీ మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుతున్నారా? అందుకు సంబంధించిన సంకేతాలు క‌నిపిస్తున్నాయా?

  • Written By:
  • Updated On - August 1, 2022 / 05:48 PM IST

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని మోడీ మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుతున్నారా? అందుకు సంబంధించిన సంకేతాలు క‌నిపిస్తున్నాయా? ఈనెల 7వ తేదీన జ‌రిగే ప‌రిణామం ఏపీ రాజ‌కీయాల‌ను మార్చ‌నుందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్నం కావ‌డం స‌హ‌జం. ఎందుకంటే, మ‌ళ్లీ బీజేపీ, టీడీపీ ఒక‌టి కావ‌డానికి బ‌ల‌మైన అడుగులు పడుతున్నాయి. అందుకు ఢిల్లీ వేదిక కానుంది.

భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఈ నెల 6న రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో `ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్` ఉత్స‌వాల సన్నాహ‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానం పంపింది. సానుకూలంగా స్పందించిన చంద్ర‌బాబు ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఈ నెల 6న చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్న నేప‌థ్యంలో `ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్` పేరిట కేంద్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉత్స‌వాల‌ను వ‌చ్చే ఏడాది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

2018 నుంచి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దూరంగా ఉంటూ చంద్ర‌బాబు రాజ‌కీయాలు న‌డిపారు. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఢీ అంటే ఢీ అంటూ రాజ‌కీయాలు చేయ‌డంతో పాటు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దీంతో శాశ్వ‌తంగా బీజేపీ, టీడీపీ మ‌ధ్య సంబంధాలు తెగిపోయాయి. ఫ‌లితంగా వైసీపీ బాగా ఎన్డీయేకి ద‌గ్గ‌ర అయింది. అందుకే, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం అయ్యాడ‌ని టీడీపీ ప్ర‌గాఢంగా విశ్వసిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ను ఓడించాలంటే బీజేపీ మ‌ద్ధ‌తు కావాల‌ని టీడీపీ కోరుకుంటోంది. ఎన్డీయేకు ద‌గ్గ‌ర కావాల‌ని ప‌లు ర‌కాలుగా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. కానీ, మోడీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేదు. ఇటీవ‌ల సానుకూల సంకేతాలు చంద్ర‌బాబుకు బీజేపీ నుంచి ల‌భిస్తున్నాయి.

భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా టీడీపీకి కేంద్రం ఆహ్వానం పంపింది. అంతేకాదు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఫోన్ ద్వారా చంద్ర‌బాబును ఆహ్వానించారు. అందుకే, టీడీపీ ప్ర‌తినిధిగా అచ్చెంనాయుడును పంపారు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా ప్రొటోకాల్ జాబితాను హైజాక్ చేశార‌ని ఆనాడు టీడీపీ ఆరోపించింది. ఆ త‌రువాత జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ముర్ము విజ‌య‌వాడ వ‌చ్చిన సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యారు. ఢిల్లీ నుంచి అమిత్ షా ఇచ్చిన సంకేతానికి అనుగుణంగా ముర్ము టీడీపీతో స‌మావేశం అయ్యార‌ని తెలుస్తోంది.

తాజాగా ఢిల్లీ కేంద్రంగా జ‌రిగే `ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వం` ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, చంద్ర‌బాబును క‌ల‌ప‌బోతుంది. అందుకే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక కానుంది. ఈ ప‌రిణామాల‌ను చూస్తే మ‌ళ్లీ బీజేపీ, టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఒకే వేదిక‌పై క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అర్థం అవుతోంది.