Old Congressmen: గుర్తుకొస్తున్నారు.!

స‌మైఖ్యాంధ్ర పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదిక‌గా రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 02:44 PM IST

స‌మైఖ్యాంధ్ర పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదిక‌గా రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఏఐసీసీ పిలుపు మేర‌కు హ‌స్తిన వెళ్లిన ఆయ‌న‌కు ఇంకా అపాయిట్మెంట్ ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది. అయితే, ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి ఉమెన్ చాందీతో మాత్రం పలుమార్లు క‌లిశారు. కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ మ‌య్య‌ప్ప‌న్ తో భేటీ అయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలో జ‌రిగిన చింత‌న్ శిబిర్ ఇచ్చిన పిలుపు మేర‌కు పార్టీకి సేవ చేయాల‌ని కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వ‌చ్చార‌ని మ‌య్య‌ప్ప‌న్ చెబుతున్నారు.

స‌మైఖ్యాంధ్ర పార్టీ త‌ర‌పున 2014 ఎన్నిక‌ల్లో పోటీకి దిగిన కాంగ్రెస్ ఉద్ధండుల‌ను ఏపీ ప్ర‌జ‌లు ఛీత్క‌రించారు. డిపాజిట్ల‌కు కూడా ద‌గ్గ‌ర‌కు రాని విధంగా ఓట‌ర్లు తిర‌స్క‌రించారు. ఆనాడు రాష్ట్రాన్ని విడ‌గొట్ట‌డానికి అవ‌స‌ర‌మైన బిల్లును అసెంబ్లీలో విజ‌య‌వంతంగా ఆమోదింప చేసి పంపిన చిట్ట‌చివ‌రి ఉమ్మ‌డి ఏపీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని బ‌య‌ట నుంచి చంద్ర‌బాబు మూడేళ్ల పాటు నిల‌బెట్టారు. లేదంటే కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం ముందుగానే కూలిపోయేది. అప్పుడు ఎన్నిక‌ల రాష్ట్ర విభ‌జ‌న ఎజెండాగా వెళ్లాల్సి వ‌చ్చేది. అప్పుడు ఓట‌ర్లు తీర్పు ఎలా ఉండేదో..అందరికీ తెలిసిందే. అందుకే, కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండ‌గానే అసెంబ్లీలో విభ‌జ‌న బిల్లుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రం విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌కుడిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఆనాడు సీఎం హోదాలో నిలిచారు. అందుకే, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌నతో పాటు ఆయ‌న పెట్టిన పార్టీని చెప్పు గుర్తుతో చీత్క‌రించారు. తాజాగా రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని కిర‌ణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆయ‌న చాలా కాలంగా ఆశిస్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకుడు ర‌ఘువీరారెడ్డి పీసీసీ అధ్య‌క్షునిగా ఉన్న‌ప్పుడు ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ ఉండేవి. ఆయ‌న స్థానంలో డాక్ట‌ర్ శైల‌జానాథ్ ను నియ‌మించిన‌ప్ప‌టి నుంచి పూర్తిగా ఉనికి కోల్పోయింది. దీంతో ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడుగా కిర‌ణ్ కుమార్ రెడ్డిని నియ‌మించుకోవాల‌ని అధిష్టానం భావిస్తోంది. అందుకే, ఢిల్లీ వేదిక‌గా ఆయ‌న ప‌డిగాపులు కాస్తున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ కీల‌క లీడ‌ర్లుగా ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, కిర‌ణ్ కుమార్ రెడ్డి, కేవీపీ, చిరంజీవి త‌దిత‌రులు ఉన్నారు. కొంద‌రు బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. మిగిలిన వాళ్లు రాజ‌కీయ చౌర‌స్తాలో ఉండిపోయారు. వాళ్ల‌ను మ‌ళ్లీ యాక్టివ్ చేయ‌డం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడాల‌ని అధిష్టానం భావిస్తోంది. ప్ర‌త్యేక హోదా అనే అంశాన్ని చూప‌డం ద్వారా ఏపీ ఓట‌ర్ల‌ను ఆకర్షించాల‌ని చూస్తోంది. ఆ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి రోల్ ఏంటి? అనేది ప‌లువురు ఆలోచిస్తున్నారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌లేదు. ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ ప్రాథమిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌లేదు. ఆయ‌న్ను పీసీసీ చీఫ్ గా చేయాల‌ని కొంత కాలంగా అధిష్టానం భావించింది. కానీ, ఆయ‌న్నుంచి ఎలాంటి పాజిటివ్ స్పంద‌న లేక‌పోవ‌డంతో కిర‌ణ్ కుమార్ రెడ్డిని సీన్లోకి కాంగ్రెస్ అధిష్టానం తీసుకొస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం రాజ‌స్థాన్ చింత‌న్ శిబిర్ త‌రువాత సీనియ‌ర్ల‌కు ఆహ్వానం ప‌లుకుతోంది.అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ద‌వుల‌ను ఎంజాయ్ చేసిన సీనియ‌ర్ల‌ను పిలిచి మాట్లాడేందుకు సిద్ధం అయింది. ఆ క్ర‌మంలో ఢిల్లీలో ప‌డిగాపులు కాస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి ఎలాంటి ప‌ద‌వితో వ‌స్తారో చూద్దాం.