జనసేనాని పవన్ కల్యాణ్ బలాన్ని చంద్రబాబు ఎక్కువగా ఊహించుకుంటున్నాడా? అవ్యాజ్యప్రేమతో సలహాదారులు చెప్పే మాటలను నమ్ముకుని జనసేన పాట పడుతున్నాడా? జనసేనకు లేని ప్రేమ తెలుగుదేశం పార్టీకి ఎందుకు? బాబు చెప్పిన ఒన్ సైడ్ లవ్ పార్టీకి నష్టమా?.. ఇవే అంశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే జనసేన రాజకీయంగా పిల్లకూన. పైకి మాత్రం కింగ్ మేకర్ కాబోతున్నామనే ఫోకస్ ఇస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైయ్యేనాటికి యువరాజ్యం అధ్యక్షుడుగా పవన్ కల్యాణ్ ఉన్నాడు. 2009 ఎన్నికల సందర్భంగా మెగా హీరోలు అందరూ ప్రచారం చేశారు. ఫలితంగా 294 స్థానాలకు గాను 18 చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రజారాజ్యం అధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి పాలకొల్లు నుంచి ఓడిపోగా స్వల్ప మోజార్టీతో తిరుపతిలో గెలుపొందాడు. ఆ తరువాత పార్టీని నడపలేక ఏడాది తిరగకముందే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి పదవిని చిరంజీవి సంపూర్ణంగా అనుభవించాడు.
రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికలకు ముందుగా మెగా ఫ్యామిలీ నుంచి జనసేన పుట్టింది. దానికి హోల్ అండ్ సోల్ గా పవన్ కల్యాణ్ మాత్రమే ఆనాడు కనిపించాడు. సంస్థాగతంగా ఎలాంటి నిర్మాణం లేకపోయినప్పటికీ 2014 ఎన్నికల సభల్లో బీజేపీ, టీడీపీ వేదికలపై పవన్ కనిపించాడు. దీంతో పైసా ఖర్చు, శ్రమలేకుండా అవసరమైనంత ఫోకస్ ఆ పార్టీకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పవన్ బలం నైతికంగా పెరిగింది. క్రమంగా సంస్థాగత నిర్మాణం వైపు పవన్ అడుగులు వేశాడు. కానీ, 2019 ఎన్నికల నాటికి కొందరు జనసేన సిద్ధాంతకర్తలు బయటకు వెళ్లారు. మరికొందరు ఎన్నికలకు ముందు పవన్ వాలకం నచ్చకపోవడంతో గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ కమ్యూనిస్ట్ లు, బీఎస్పీతో జతకట్టి జనసేన తొలిసారి 2019 ఎన్నికల బరిలోకి దిగింది. భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఓడిపోయాడు. ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం జనసేన నుంచి గెలిచాడు. మిగిలిన చోట్ల డిపాజిట్లు వచ్చిన స్థానాల సంఖ్య బహు తక్కువ. ఆ మూడు పార్టీలకు కలుపుకుని వచ్చిన ఓటు బ్యాంకు సుమారు 6శాతం. దాన్లో జనసేన వాట రెండు నుంచి 3శాతం ఉంటుందని అంచనా. కానీ, పవన్ క్రేజ్ ను మాత్రం టీడీపీ ఎక్కువగా అంచనా వేస్తోంది.
ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తు ఏపీలో కొనసాగుతోంది. కానీ, బద్వేల్, తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఆ రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కొన్ని చోట్ల కలిసి విజయం సాధించాయి. దీంతో జనసేనతో కలిసి వెళుతున్నామని కొందరు టీడీపీ నేతలు స్లోగన్ అందుకున్నారు. సాక్షాత్తు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ షరీప్ పశ్చిమగోదావరి జిల్లా పార్టీ సమావేశంలో జనసేనతో పొత్తు ఉంటుందని చెప్పాడు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లాడు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా ఒన్ సైడ్ లవ్ ఉందని చంద్రబాబు చమత్కరించాడు. అంటే..తెలుగుదేశం పొత్తుకు రెడీ గా ఉందని, జనసేన అందుకు సిద్ధం కావడంలేదని(టూ సైడ్ లవ్ లేదని) పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాపులకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి ఆ వర్గం ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా సమావేశం అయింది. జనసేనకు మద్ధతు ఇవ్వడమా? కొత్త పార్టీ పెట్టడమా? అనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఒక వేళ కాపు నేతలు కొత్త పార్టీ పెడితే, జనసేనకు 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అలా కాకుండా జనసేనకు సీనియర్ కాపు నేతలందరూ మద్ధతు ఇస్తే..కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారట. సో..జనసేనతో పొత్తు పెట్టుకుంటే మరోసారి అధికారంలోకి రావాలన్న టీడీపీ లక్ష్యం నెరవేరడం కష్టం. ఇలాంటి ఈక్వేషన్ల నడుమ చంద్రబాబు `వన్ సైడ్ లవ్` ఎందుకు చేస్తున్నాడో..ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్లకే తెలియాలి!