Site icon HashtagU Telugu

Chandrababu : చంద్ర‌బాబు మంచిత‌న‌మే..మైన‌స్.!

Chandrababu Vallabhaneni Vamsi

Chandrababu Vallabhaneni Vamsi

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అసెంబ్లీని బ‌హిష్క‌రించిన త‌రువాత తొలి విజ‌యం సాధించాడు. రెబల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోకారిల్లి చంద్ర‌బాబుకు క్ష‌మాప‌ణ చెప్పాడు. అసెంబ్లీ వేదిక‌గా భువనేశ్వ‌రి శీలంపై చేసిన కామెంట్ల‌కు వంశీ లెంప‌లు వేసుకున్నాడు. ఆ వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రు బాధ‌ప‌డినా క్ష‌మాప‌ణ చెబుతున్నానంటూ మీడియా ఎదుట మ‌న‌స్తాపం చెందాడు. అంతేకాదు, ఇంత రాద్ధాంతం అవుతుంద‌ని ఊహించ‌లేదంటూ అస‌హాయ‌త‌ను వ్య‌క్త‌ప‌రిచాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే చంద్ర‌బాబు ర‌చించిన వ్యూహానికి వంశీ మోకారిల్లాడు. ఇక మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని వంతు మాత్ర‌మే మిగిలింది.సాధార‌ణంగా చంద్ర‌బాబు క‌క్ష్య సాధింపు మ‌నస్త‌త్వం ఉన్న లీడ‌ర్ కాదు. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీని వీడి ఎంత మంది వెళ్లిన‌ప్ప‌టికీ వాళ్ల‌ను మ‌ళ్లీ సాద‌రంగా ఆహ్వానించాడు. ఆయ‌న టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత అత్యున్న‌త ప‌ద‌వుల‌ను అనుభ‌వించి, అధికారం పోయిన వెంట‌నే ప్ర‌త్య‌ర్థి పార్టీల వైపు వెళ్లిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇచ్చిన వాళ్లు దాదాపుగా పార్టీలో లేరు. పైగా చంద్ర‌బాబును టార్గెట్ చేసి వాళ్లు మాట్లాడుతుంటారు.పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అనేక మంది జైళ్లుకు వెళ్లి పార్టీ కోసం ప‌నిచేసిన వాళ్లు ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎవ‌రెవ‌రినో చంద్ర‌బాబు అందలం ఎక్కించాడు. ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను తీసుకుని మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టాడు. కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌ను ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు అప్ప‌గించాడు. ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగానూ, శ‌రీర లోపాల‌ను కూడా వ‌ద‌ల‌కుండా జూపూడి ప్ర‌భాక‌ర్ వైసీపీలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శించాడు. కానీ, ఆయ‌న్ను పార్టీలోకి తీసుకుని ఎస్పీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు, ఎమ్మెల్సీగా చేశాడు. ఇదే చంద్ర‌బాబుకు ఉన్న పెద్ద మైన‌స్ పాయింట్

చంద్ర‌బాబు మీద ఒంటికాలు మీద లేచిన మీడియా అధిప‌తులు ఉన్నారు. జ‌య‌హో కాంగ్రెస్ అంటూ స‌హాయం చేసిన చంద్ర‌బాబును కాద‌ని వైఎస్ ప‌క్షాన నిలిచిన వాళ్లు లేక‌పోలేదు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వెన్నంటి ఉండ‌డమే కాదు, చంద్ర‌బాబును వ్య‌క్తిగ‌త టార్గెట్ చేసిన మీడియా అధిప‌తులు ఉన్నారు. బాబును అన‌రాని మాట‌లు అని ఆడిపోసుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ల‌నే 2014లో అధికారంలోకి రాగానే ద‌గ్గ‌ర‌కు తీసుకున్న పెద్ద మ‌న‌సు చంద్ర‌బాబుది.చంద్ర‌బాబు మంచిత‌నాన్ని చేత‌గాని త‌నంగా చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు చూస్తున్నారు. మ‌ళ్లీ అధికారంలోకి టీడీపీ వ‌స్తే వెంట‌నే బాబు పంచ‌న చేర‌డం పెద్ద క‌ష్టం కాద‌ని వాళ్ల భావ‌న‌. అందుకే, ప్ర‌త్య‌ర్థి పార్టీలోఉన్న వంశీ, నాని లాంటి వాళ్లు బండ‌బూతులు ఆయ‌న్ను తిడుతున్నారు. అవ‌స‌ర‌మైతే, మ‌ళ్లీ పార్టీలోకి వెళ్లొచ్చ‌నే ఆలోచ‌న బ‌హుశా వాళ్లలో ఉండ‌డం త‌ప్పుకాదు. అందుకే, ఇటీవ‌ల చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. పార్టీని క‌ష్ట‌కాలంలోవ‌దిలి వెళ్లిన వాళ్ల‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇవ్వ‌నంటూ వెల్ల‌డించాడు. ఇలాంటి మాట‌ల‌ను 2009 ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు వినిపించాడు. ఆ త‌రువాత 2014లో ఏం జ‌రిగిందో..మ‌నంద‌రికీ తెలుసు.

ఇప్పుడు వంశీ కూడా బ‌హుశా 2009, 2014 ప‌రిణామాల‌ను గుర్తు చేసుకుని ఉంటాడు. కానీ, ఈసారి లోకేష్ రూపంలో మునుప‌టి మాదిరిగా ఉండ‌ద‌ని కార్తీక స‌మారాధాన స‌భ‌ల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు గ‌ట్టిగా చెప్పేశారు. అంతేకాదు, భౌతికంగా వంశీ, నాని మీద అటాక్ చేయాల‌ని ఖ‌మ్మం జిల్లాకు చెందిన కార్పొరేట‌ర్ వాసు ప‌బ్లిక్ గా వార్నింగ్ ఇచ్చాడు. సొంత సామాజిక‌వ‌ర్గం నుంచి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన వంశీ ముందుగా క్ష‌మాప‌ణ చెప్పాడు. ఇక నాని ఎలా స్పందిస్తాడో..చూడాలి. ఇదంతా చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో సామాజిక వ‌ర్గంలో సాధించిన తొలి విజ‌యంగా ఆయ‌న అనుచ‌రులు భావిస్తున్నారు.