YSCRP Leader: వైసీపీ ఎమ్మెల్యేను ‘చితక్కొట్టిన’ సొంత క్యాడ‌ర్!

శనివారం ఉదయం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు పెద్దఎత్తున దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 05:23 PM IST

శనివారం ఉదయం ఏపీలోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు పెద్దఎత్తున దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన వైఎస్‌ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్‌ మృతిపై విచారించేందుకు ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించారు. వైఎస్సార్‌సీపీ నేత కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే కలవాలనుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సొంత పార్టీ ఎమ్మెల్యే పై దాడి చేశారు. అయితే గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎమ్మెల్యేను కాపాండేందుకు వచ్చిన అనుచరులపై దాడి చేశారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను సైతం కూడా వదలలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్‌ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్‌ను హత్య చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘర్షణలో ఎమ్మెల్యే, గ్రామస్తులు, పోలీసులు అందరూ గాయపడటంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపి ఎస్సీ నాయకుడు గంజి ప్రసాద్ ను స్థానిక వైకాప ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు దారుణంగా నరికి చంపారని గ్రామస్థుల ఆరోపణ నియోజకవర్గంలో అధికార పార్టీలోని గ్రూపు రాజకీయాలే దారుణ హత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హత్య కుట్రలో ఎమ్మెల్యే పాత్ర ఉందని గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులు నొక్కి చెప్తుండటంతో ఈ ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.