Site icon HashtagU Telugu

IPS Suspended: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు.. అసలు కారణాలివి!

Ips Venkateshwar

Ips Venkateshwar

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ సర్కార్ మరోసారి సస్పెండ్ చేసింది. నిజానికి వైసీపీ ప్రభుత్వం వచ్చినంత వరకు ఏబీ వెంకటేశ్వరరావు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. కానీ 2019 మే 30న ఆయనను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. అయినా పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. తరువాత సుప్రీం ఆదేశాలతో ఎట్టకేలకు 15 రోజుల కిందటే పోస్టింగ్ ఇచ్చింది. కానీ అంతలోనే ఆయనను మళ్లీ సస్పెండ్ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కు అసలు కారణాలు ఏమిటా అని చూస్తే.. తాను ఎదుర్కొంటున్న ఓ కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్నది తాజా అభియోగం. అందుకే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తురులు జారీ చేశారు. గతంలో నిఘా విభాగం చీఫ్ గా పనిచేసినప్పుడు ఆయన భద్రతా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే అప్పుడు ఏపీ ఏసీబీ ఆయనపై కేసు పెట్టింది. దీంతో సర్కార్ ఆయనను 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేసింది. దీంతో ఆయన హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీం ఆదేశాలతో ఈ సంవత్సరం మే 18 తిరిగి విధుల్లోకి తీసుకుంది. జూన్ 14న ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది.

ఏబీ వెంకటేశ్వరరావు పై ఉన్న అభియోగాల వల్ల ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడానికి సిఫార్స్ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీస్ లో ఉండే అధికారులపై క్రిమినల్ అభియోగాలు వస్తే.. అవి పూర్తిగా తొలగిపోయేంతవరకు కాని, వాటిని కొట్టేసేంతవరకు కాని.. ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయవచ్చని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. నిజానికి ఆయనకు మొదటి సస్పెన్షన్ తరువాత ఉద్యోగంలోకి తీసుకున్నామని… అయినా ఆయన తనపై ఉన్న కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. అందుకే సస్పెండ్ చేశామంది. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో ఆయన విజయవాడ దాటి వెళ్లడానికి వీల్లేదని చెప్పింది.