Site icon HashtagU Telugu

Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

Investment In Ap

Investment In Ap

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్‌ఏఈఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 7,000 మందికి, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. నవంబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీసీఐ భాగస్వామ్య సదస్సులో ఈ పెట్టుబడులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్‌ఏఈఎల్‌ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరే అవకాశముందని సమాచారం. రాష్ట్రంలోని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగం పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతున్నదీ, ఇది ఆంధ్రప్రదేశ్‌ను ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

కడప, కర్నూలు జిల్లాల్లో 1,750 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (BESS) ప్రాజెక్టులను ఎస్‌ఏఈఎల్‌ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులు నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌ (NHPC), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SECI) టెండర్లలో భాగంగా అమలు కానున్నాయి. పరిశ్రమలు, డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యం. అదనంగా, 200 మెగావాట్ల సామర్థ్యం గల బయోమాస్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 25 మెగావాట్ల చొప్పున పలు ప్లాంట్లు ఉండగా, వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా వినియోగించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా పునరుత్పాదక శక్తిని వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం ఉంది.

అంతేకాకుండా, రూ.3,000 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో డిజిటల్‌ ఆర్థిక వృద్ధికి దారితీయనున్నారు. ఈ సెంటర్లు కృత్రిమ మేధస్సు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించనున్నాయి. అలాగే రూ.4,000 కోట్ల పెట్టుబడితో పోర్టు ఆధారిత లాజిస్టిక్స్‌, ఎగుమతుల మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలని ఎస్‌ఏఈఎల్‌ యోచిస్తోంది. ఇప్పటికే కంపెనీ ఏపీలో రూ.3,200 కోట్ల పెట్టుబడులు పెట్టి, 9 నెలల్లో 600 మెగావాట్ల సామర్థ్యాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఇటీవల హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్లతో గ్రీన్‌ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, ఇప్పుడు ఎస్‌ఏఈఎల్‌, బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థల పెట్టుబడులు ఏపీని పునరుత్పాదక శక్తి రంగంలో దేశంలో అగ్రగామిగా నిలపనున్నాయి. ఇది రాష్ట్రానికి శుద్ధ ఇంధన విప్లవానికి నాంది అని చెప్పవచ్చు.

Exit mobile version