Site icon HashtagU Telugu

Sardar Gouthu Latchanna: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న.. మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విబేధం..!

Sardar Gouthu Latchanna

Compressjpeg.online 1280x720 Image

Sardar Gouthu Latchanna: గౌతు లచ్చన్న భారతదేశంలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తరువాత సర్దార్‌ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్‌. సర్దార్‌ గౌతు లచ్చన్న(Sardar Gouthu Latchanna).. నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌, జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్ళారు. ప్రకాశం పంతులు, బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు.

తెలంగాణా కోసం మర్రి చెన్నారెడ్డితో చేతులు కలిపాడు. తెలంగాణా రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. చౌదరి చరణ్‌ సింగ్‌, జయప్రకాష్‌ నారాయణ, మసానిలతో పనిచేశాడు. సర్దార్‌ గౌతు లచ్చన్న ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబంలో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8వ సంతానంగా పుట్టాడు. లచ్చన్న తాత, తండ్రులు గౌడ కులవృత్తే వారికి కూడుబెట్టేది. ఈతచెట్లను కోత వేసి కల్లు ఉత్పత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క గ్రామాల్లో గల కల్లు దుకాణాలకు కల్లు సరఫరా చేయడం వారి వృత్తి.

Also Read: Lovers Romance : ప్రేయసి ఇంటికి వెళ్లిన ప్రియుడు..రూమ్ లో ఉండగా ఎంట్రీ ఇచ్చిన తల్లిదండ్రులు

మెట్రిక్యులేషన్‌ చదువుతుండగానే 21వ ఏట గాంధీజీ పిలుపు విని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్య్రోద్యమంలో దూకాడు. 1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఆ ఉద్యమాన్ని నడిపాడు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి అహుతి చేశాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటున్నప్పుడు లచ్చన్నను అరెస్టు చేసి టెక్కలి, నరసన్నపేట సబ్‌ జైళ్లల్లో నలభై రోజులు ఉంచారు. కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజుల శిక్షను అతను బరంపురం జైల్లో అనుభవించవలసి వచ్చింది. వివిధ పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చాడు.

మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు సర్దార్‌ వల్లభభాయి పటేల్‌. మరొకరు సర్దార్‌ గౌతు లచ్చన్న. ఒకరిది దేశస్ధాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్‌ అంటే సేనాని. స్వాతంత్య్రోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న. జమిందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా మంచి మనిషీ ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్‌ 19న కన్నుమూశాడు.