AP Politics : బాబు, జ‌గ‌న్ చెరోదారి!వార‌సుల‌కు దారేది.!

రాజ‌కీయాల్లో `వార‌స‌త్వం` ఒక పెద్ద డిబేట‌బుల్ ఇష్యూ. స్వాతంత్ర్య భార‌తావ‌నిలో వార‌స‌త్వం రాజ‌కీయానికి ఫుల్ స్టాప్ ప‌డ‌డంలేదు.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 12:36 PM IST

రాజ‌కీయాల్లో `వార‌స‌త్వం` ఒక పెద్ద డిబేట‌బుల్ ఇష్యూ. స్వాతంత్ర్య భార‌తావ‌నిలో వార‌స‌త్వం రాజ‌కీయానికి ఫుల్ స్టాప్ ప‌డ‌డంలేదు. అందుకే, ఆ అంశాన్ని త‌ర‌చూ బీజేపీ ప్ర‌త్య‌ర్థుల‌పై అస్త్రంగా ప్ర‌యోగిస్తోంది. దేశం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు వార‌స‌త్వ రాజ‌కీయం రాజ‌రికం మాదిరిగా అల్లుకుపోయింది. దాన్ని పెకలించ‌డానికి `కాంగ్రెస్ ముక్త్ భార‌త్` నినాదాన్ని బీజేపీ తీసుకుంది. కానీ, ఆయా రాష్ట్రాల్లో వార‌స‌త్వ రాజ‌కీయం ఊడ‌లు దిగింది. దాన్ని తొల‌గించ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ రాజ‌రికం మాదిరిగా వార‌సుల‌కు అధికారాన్ని ప్రాంతీయ పార్టీలు పంచిపెడుతున్నాయి. త‌ద్భిన్నంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం వార‌సుల‌కు 2024 ఎన్నిక‌ల్లో టిక్కెట్ల‌ను ఇచ్చేది లేద‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు మాత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహానికి భిన్నంగా వార‌స‌త్వానికి జై కొడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఇంచార్జిగా శ్రీనివాసుల‌రెడ్డి బ‌దులుగా దినేశ్ రెడ్డిని ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో సుమారు 40 మంది సీనియ‌ర్ల కుటుంబంలోని వాళ్ల‌కు టిక్కెట్ల‌ను ఇచ్చింది. వాళ్లంద‌రూ దాదాపుగా ఓడిపోయారు. ఈసారి కూడా వార‌సుల‌ను పెద్ద ఎత్తున రంగంలోకి దింప‌డానికి టీడీపీ వృద్ధ సింహాలు సిద్ధం అవుతున్నాయి. అందుకు, చంద్ర‌బాబునాయుడు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు(1993) వ‌చ్చిన కొత్త‌త‌రం ఇప్పుడు పాత‌త‌రంగా మారిపోయింది. అందుకే, పాత త‌రాన్ని కొత్త లుక్ లో చూపించ‌డానికి వార‌సుల‌ను దించాల‌ని సీనియ‌ర్లు చంద్ర‌బాబుపై ఒత్తిడి తెచ్చారు. ఇప్ప‌టికే యువ‌త‌కు 40శాతం టిక్కెట్ల ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఆ కోటాను వార‌సుల‌తో భ‌ర్తీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని పార్టీలోని టాక్‌.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి రోజూ నియోజ‌క‌వ‌ర్గాల రివ్యూల్లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 120 నియోజ‌క‌వ‌ర్గాల్లోని రాజ‌కీయాన్ని స‌మీక్షించార‌ని తెలుస్తోంది. సిట్టింగ్ లు అంద‌రికీ టిక్కెట్ల‌ను ఇవ్వ‌డానికి ఆయ‌న సిద్ధం అయ్యారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఇంచార్జిల ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. మ‌రికొంద‌రు వార‌సుల‌ను ప్రోత్సహించ‌డాన్ని ఆయ‌న ప‌రోక్షంగా స‌మ‌ర్థిస్తున్నారు. దీంతో ఐక‌మ‌త్యం ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపించ‌డంలేదు. 40 ఏళ్లుగా ప‌రిమిత కుటుంబాలకు మాత్ర‌మే తెలుగుదేశం పార్టీ రాజకీయం ప‌రిమితం అయింది. ఇదే అంశాన్ని రాజ‌కీయ అస్త్రంగా మ‌లుచుకునే ప‌నిలో వైసీపీ ఉంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈసారి ఎన్నిక‌ల్లో వార‌సుల‌కు టిక్కెట్ల ఇచ్చేది లేద‌ని ముందే ప్ర‌క‌టించారు. దీంతో మాజీ మంత్రులు పేర్ని నాని, బాలినేని శ్రీనివాసుల‌రెడ్డి, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి తిక‌మ‌క ప‌డుతున్నారు. వాస్త‌వంగా ఆ ముగ్గురు ఈసారి వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని యోచించారు. కానీ, ఆదిలోనే వాళ్ల ఆలోచ‌న‌కు జ‌గ‌న్ బ్రేక్ వేయ‌డంతో మిగిలిన లీడ‌ర్ల కూడా స‌ర్దుకున్నారు. లేదంటే, క‌నీసం 50 మంది వ‌ర‌కు వార‌సుల‌ను 2024 ఎన్నిక‌ల‌కు రెడీ చేయాల‌ని ప్లాన్ చేశారు. తాజాగా జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో వార‌సుల‌కు `నో ఛాన్స్` అంటూ చెప్ప‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైయింది. ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ వార‌సుల విష‌యంలో భిన్నంగా వెళ్ల‌డం హాట్ టాపిక్ గా మారింది.