Site icon HashtagU Telugu

Vijayawada TDP: విజ‌య‌వాడ టీడీపీలో ముస‌లం

Kesineni Nani Kesineni Sivanath

Kesineni Nani Kesineni Sivanath

విజ‌య‌వాడ తెలుగుదేశం పార్టీ రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతోంది. అక్క‌డి ఎంపీ కేశినేని వాల‌కం తొలి నుంచి పార్టీకి ఇబ్బందిగా మారింది. రెండోసారి ఎంపీగా గెలిచిన త‌రువాత చంద్ర‌బాబును ప్ర‌శ్నించే స్థాయికి కేశినేని వెళ్లిపోయారు. 2014లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన ఆయ‌న కేశినేని ట్రావెల్స్ వ్య‌వ‌హారంలో వివాదాల తెర‌పైకి ఎక్కారు. అప్ప‌టి నుంచి త‌ర‌చూ ఏదో ఒక రూపంలో టీడీపీకి ఇబ్బంది క‌లిగించేలా ఆయ‌న వాల‌కం ఉంది. ఆ విష‌యాన్ని టీడీపీ అధిష్టానం గ‌మ‌నించింది. ఆయ‌న‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా చెక్ పెట్ట‌నుంది.

లోక్ స‌భ వేదిక‌గా ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వాళ్ల‌కు ప‌ర‌స్ప‌రం పొస‌గ‌డంలేద‌ని పార్టీలోని టాక్‌. ప్ర‌త్యేకించి కేశినేని క‌లిసి వెళ్ల‌లేకపోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, విజ‌య‌వాడ కేంద్రంగా ఉన్న బుద్దా వెంక‌న్న‌, బోండా ఉమ తదిత‌ర లీడ‌ర్ల‌ను తొలి నుంచి ఆయ‌న విభేదిస్తున్నారు. వాళ్ల మ‌ధ్య చాలా కాలంగా న‌డుస్తోన్న ప్ర‌చ్ఛ‌న్నయుద్ధం విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డింది. ఫ‌లితంగా అమ‌రావ‌తి ఎజెండాను వినిపించిన‌ప్ప‌టికీ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. పైగా త‌ర‌చూ మీడియాకు ఎక్కుతూ టీడీపీ అధిష్టానం తీరును ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ కేశినేని విమ‌ర్శించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఈసారి ఎంపీగా పోటీ చేయ‌నంటూ సంకేతాలు కూడా ఇచ్చారు.

ఆయ‌న సైడ్ అవుతున్నాడ‌ని గ‌మ‌నించిన టీడీపీ అధిష్టానం కేశినేని నాని బ్ర‌ద‌ర్ ను ప్ర‌మోట్ చేస్తోంద‌ని పార్టీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాల వినికిడి. ఆ క్ర‌మంలోనే నాని బ్ర‌ద‌ర్ శివ‌నాత్ అలియాస్ చిన్ని పార్టీలో యాక్టివ్ అయ్యారు. పైగా ఆయ‌న‌కు నాని వ్య‌తిరేకులుగా ఉన్న లీడ‌ర్లు మ‌ద్థ‌తు ప‌లుకుతున్నారు. విజ‌య‌వాడ కేంద్రంగా లోకేష్ టీంగా బోండా, బుద్ధా వెంక‌న్న‌లు ఉన్నార‌ని ఫోక‌స్ అవుతోంది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని మాత్రం లోకేష్ కోట‌రీకి దూరంగా ఉండ‌డమే కాకుండా పార్టీ అధిష్టానం ప్రోత్స‌హిస్తోన్న లీడ‌ర్ల‌పై ఫైర్ అవుతుంటారు. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య కేశినేని శివ‌నాథ్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చింది.

2014, 2019 ఎన్నిక‌ల్లో నాని గెలుపు కోసం శివ‌నాథ్ కీల‌క రోల్ పోషించారు. వృత్తి ప‌రంగా రియ‌ల్ ఎస్టేట్ చేస్తుంటారు. హైద‌రాబాద్, విజ‌య‌వాడ కేంద్రంగా ఆయ‌న క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న కారుపైన ఎంపీ స్టిక్క‌ర్ ఉంటుంది. స్వ రాష్ట్రంలోనూ, ప‌క్క రాష్ట్రాల్లోనూ ఎంపీ స్టిక్క‌ర్ వాడుకుంటూ అధికారాన్ని ప‌రోక్షంగా చ‌లాయిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చూసిచూడ‌న‌ట్టు వ‌దిలేసిన నాని తాజాగా శివ‌నాథ్ పొలిటిక‌ల్ ఎంట్రీపై క‌న్నేశార‌ని తెలుసుకున్నార‌ట‌. అందుకే, న‌కిలీ ఎంపీ స్టిక్క‌ర్ తో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తిరుగుతున్నార‌ని పోలీసుల‌కు నాని ఫిర్యాదు చేశారు.

న‌కిలీ స్టిక్క‌ర్ తో తిరుగుతోన్న‌ వాహనం నంబరు టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777 గా తెలియ‌చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 27నే ఆయన ఫిర్యాదు చేయగా, జూన్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద విజయవాడ పటమట పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు తనిఖీ చేసి అన్నీ సవ్యంగానే ఉన్నట్టు గుర్తించి వదిలిపెట్టారు. ఆ వాహనం కేశినేని జానకిలక్ష్మి పేరుపై రిజిస్టరై ఉంది. ఆమె భర్త అయిన కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారని పోలీసులు నిర్థారించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి శివ‌నాథ్ టీడీపీ త‌ర‌పున‌ అభ్యర్థిగా ఎదగాలనుకుంటున్నారని, అందుకే వారి మధ్య విభేదాలకు స్టిక్క‌ర్ ఫిర్యాదు చర్చ తొలి స్టెప్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం మీద విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ వ్య‌వ‌హారం మ‌రోసారి ర‌చ్చ‌కెక్క‌డం అధిష్టానం సీరియ‌స్ గా తీసుకుంది. దీనికి ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్ట‌నుందో చూడాలి.