Vijaysaireddy Vs Sajjala : వైసీపీలో విజయసాయిరెడ్డి Vs సజ్జల.. ఎవరిది పైచేయి?

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుంది. పార్టీ అధిష్టానం దగ్గర.. ముఖ్యంగా జగన్ మనసులో ఎవరికి ఎంత వెయిట్ ఉందో.. ఎవరి స్థానం ఏమిటో పార్టీ శ్రేణులకు స్పష్టంగా తెలిసొచ్చింది.

  • Written By:
  • Publish Date - April 20, 2022 / 11:04 AM IST

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుంది. పార్టీ అధిష్టానం దగ్గర.. ముఖ్యంగా జగన్ మనసులో ఎవరికి ఎంత వెయిట్ ఉందో.. ఎవరి స్థానం ఏమిటో పార్టీ శ్రేణులకు స్పష్టంగా తెలిసొచ్చింది. దీంతో ఎవరికి సలామ్ కొట్టాలో.. ఎవరిని లైట్ తీసుకోవాలో కూడా కార్యకర్తలకు అర్థమైందా? తాజా పరిణామాలు చూస్తుంటే.. విజయసాయిరెడ్డికి ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. దానికి బదులుగా సజ్జల ప్రాధాన్యత బాగా పెరిగింది. కీలకమైన విశాఖ ప్రాంతం.. వైవీ సుబ్బారెడ్డికి చేతికి చిక్కింది. ఈ మార్పులన్నీ వైసీపీలో దేనికి సంకేతంగా నిలుస్తున్నాయి?

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి హవా మామూలుగా ఉండేది కాదు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా జరిగేది. అయినా రాజకీయాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో అదే జరిగింది. అందుకే కొత్తగా జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల విషయంలో ఆయనకు వైసీపీ అధిష్టానం ఝలక్ ఇచ్చింది.

విశాఖను కేంద్రంగా చేసుకుని.. ఇన్నాళ్లూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలపై పెత్తనం చేసిన విజయసాయిరెడ్డిపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై ఎమ్మెల్యేల నుంచి, జనం నుంచి చాలా ఫిర్యాదులు రావడంతో జగన్ సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. అందుకే తాజా పదవుల పందేరంలో ఆయనను విశాఖ నుంచి, ఏకంగా ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలకు మాత్రమే ఆయనను పరిమితం చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న ప్రాధాన్యత ఎంత పెరిగిందో.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు బాగా అర్థమైంది. అందుకే సజ్జలకు రెండు జిల్లాలకు ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలను అప్పగించారు. ఇక్కడితో ఆయన హవా ఆగలేదు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లాల అధ్యక్షులను కూడా సజ్జలే సమన్వయం చేస్తారని చెప్పడంతో ఆయన ప్రభ ఏ స్థాయిలో వెలుగుతుందో పార్టీ నేతలకు తెలిసొచ్చింది. పైగా ఏ శాఖ గురించి ప్రభుత్వం ఏ విషయం చెప్పాలన్నా దానిపై సజ్జలే ప్రెస్ మీట్ లో చెబుతారు. అందుకే ఆయనకు సకల శాఖా మంత్రి అన్న పేరు వచ్చింది. మొత్తానికి సజ్జల Vs సాయిరెడ్డి విషయంలో సజ్జలదే పైచేయి అయ్యిందంటున్నాయి వైసీపీ వర్గాలు.