AP Politics: ఆసక్తి రేపుతున్న ఏపీ పాలిటిక్స్, ఆ స్థానంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠత

  • Written By:
  • Updated On - February 27, 2024 / 10:59 AM IST

AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. సీట్ల పంపిణీపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తుండటంతో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే  తొలి జాబితా విడుదల కావడంతో గంటా శ్రీనివాసరావు, చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే ఉందని, చీపురుపల్లి నుంచి తన పోటీపై చర్చించినట్లు గంటా తెలిపారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉంటారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గంటాను బరిలో నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. భేటీలోనూ చంద్రబాబు ఇదే విషయం చెప్పారని, ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు తనతో అన్నట్లు గంటా చెప్పుకొచ్చారు.

అయితే తాను విశాఖ జిల్లాలోనే ఉండాలనుకుంటున్నట్లు.. భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబుకు గంటా వివరించారు. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై చర్చించేందుకు చంద్రబాబు పిలుస్తానని గంటా శ్రీనివాసరావుకు చెప్పారు. చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని బలవంతం చేస్తున్నారన్న వ్యాఖ్యలపై సైతం గంటా స్పందించారు. అలాంటిదేమీ లేదని, చీపురుపల్లి నుంచి పోటీ చేసినా, భీమిలి నుంచి బరిలోకి దిగినా తన గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమాగా ఉన్నారని తెలిపారు.

కానీ చీపురుపల్లి నుంచే బరిలోకి దిగుతావా అని చంద్రబాబు అడిగినట్లు స్పష్టం చేశారు. లేదు కచ్చితంగా భీమిలి అనేదే ఉద్దేశమైతే మరోసారి పిలిచినప్పుడు అభిప్రాయం చెప్పాలన్నారు. చీపురుపల్లి నుంచే గంటా పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో మంచి రెస్పాన్స్ వచ్చిందని చంద్రబాబు చెప్పినట్లు తెలిపారు.చంద్రబాబును కొన్ని రోజుల తరువాత ఇప్పుడే కలిశానని, కానీ మేం భేటీ అవ్వకుముందే తిట్టుకున్నామంటూ వదంతులు ప్రచారం జరిగిందన్నారు.