Brother Anil Kumar : బ్ర‌ద‌ర్ ‘రాజ‌కీయ’ అరుణోద‌యం

`ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు. పెట్టకూడదని రూలేం లేదు కదా..` అంటూ షర్మిల రెండు నెల‌ల క్రితం చేసిన‌ వ్యాఖ్యల త‌రువాత రెండోసారి బ్ర‌ద‌ర్ అనిల్ ఏపీలో క‌నిపించాడు.

  • Written By:
  • Publish Date - February 25, 2022 / 03:14 PM IST

`ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు. పెట్టకూడదని రూలేం లేదు కదా..` అంటూ షర్మిల రెండు నెల‌ల క్రితం చేసిన‌ వ్యాఖ్యల త‌రువాత రెండోసారి బ్ర‌ద‌ర్ అనిల్ ఏపీలో క‌నిపించాడు. తొలిసారి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ వ‌ద్ద క‌నిపించిన ఆయ‌న్ను ఏపీలో ష‌ర్మిల పార్టీ గురించి మీడియా ప్ర‌శ్నించింది. రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధంలేద‌ని దాట‌వేసే ప్ర‌య‌త్నం ఆనాడు చేశాడు. చ‌ర్చి ప్రారంభానికి వ‌చ్చి వెళుతున్నానంటూ దాట‌వేశాడు. తాజాగా రాజ‌మండ్రి వెళ్లిన బ్ర‌ద‌ర్ అనిల్ ఏకంగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యాడు. సుదీర్ఘంగా వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ చ‌ర్చ జ‌రిగింది. ఆ విష‌యాన్ని బ్ర‌ద‌ర్ అనిల్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల‌తో పాటు ఉక్రెయిన్ , ర‌ష్యా యుద్ధం వ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్యా ప‌లు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని అనిల్ చెప్ప‌డం ప‌లు వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తొలి నుంచి స్వ‌ర్గీయ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఏపీ సీఎం జ‌గ‌న్ లో పాటు వైఎస్ కుటుంబ స‌భ్యులు అంద‌రితోనూ స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజ‌కీయంగా వైఎస్ ఆనాడు ఉండ‌వ‌ల్లికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే వాడు. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు ప‌లు విష‌యాల‌ను ఇద్ద‌రూ చ‌ర్చించుకునే వాళ్ల‌ని కాంగ్రెస్లోని సీనియ‌ర్ల‌కు తెలుసు. ఆ చ‌నువుతోనే ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఉండ‌వ‌ల్లి ఇస్తున్నాడు. ప్ర‌జా వ్య‌తిరేక అంశాల‌పై మీడియా ముఖంగా జ‌గ‌న్ ను హెచ్చ‌రిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలోని ప‌లు అంశాల‌పై అధ్య‌య‌నం చేసిన ఉండ‌వ‌ల్లి అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సూచ‌న‌లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, నేరుగా క‌ల‌వ‌డానికి మాత్రం ఎప్పుడూ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. మీడియా ముఖంగా మాత్ర‌మే లోపాల‌ను తెలియ‌చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. మ‌ద్యం , ఇసుక పాల‌సీల‌ను బాహాటంగా ఉండ‌వ‌ల్లి వ్య‌తిరేకించాడు. మాజీ సీఎం చంద్ర‌బాబును ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టాడు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మెచ్చుకోవ‌డం కంటే విమ‌ర్శించ‌డమే ఎక్కువ‌గా ఉండ‌వ‌ల్లి విష‌యంలో క‌నిపిస్తోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్ తో విభేదించిన ష‌ర్మిల తెలంగాణ‌లో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. ఆ విష‌యం జ‌గ‌న్ కు న‌చ్చ‌లేదు. పైగా పార్టీని మూసివేయాల‌ని ఇటీవ‌ల ష‌ర్మిల‌తో గొడ‌వ ప‌డిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఇడుపుల పాయ వేదిక‌గా ఇద్ద‌రి మ‌ధ్యా వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ విష‌యంలో వివాదం నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు మ‌ధ్యా ఆస్తుల గొడ‌వ న‌డుస్తోంద‌ని వైఎస్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సీనియ‌ర్లు కొంద‌రు బాహాటంగా చెబుతున్నారు. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ వైఎస్ఆర్టీపీ తెలంగాణ‌లో ప‌నిచేస్తుంద‌ని ష‌ర్మిల చెబుతోంది. రెండో విడ‌త పాద‌యాత్ర‌కు కూడా ఆమె సిద్ధం అవుతోంది. అదే స‌మయంలో ఏపీలోనూ పార్టీని విస్త‌రింప చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని లోట‌స్ పాండ్ నుంచి సంకేతాలు వ‌స్తున్నాయి. వాటికి బ‌లం చేకూరేలా ఎవ‌రైనా ఎక్క‌డైన పార్టీ పెట్టొచ్చ‌ని ష‌ర్మిల చెప్పిన విష‌యం తెలిసిందే.తెలంగాణ కంటే ఏపీలోనే ష‌ర్మిల‌కు క్రేజ్ ఉంద‌ని అంచ‌నా. బ్ర‌దర్ అనిల్ రూపంలో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క‌లిసొచ్చింద‌ని విశ్లేష‌కుల భావ‌న‌. ఏపీలోని దళితులు దాదాపు 80శాతం మంది క్రిస్టియ‌న్లుగా మారారు. వాళ్ల మ‌ద్ధ‌తు బ్ర‌ద‌ర్ అనిల్ కు స‌హ‌జంగా ఉంటుంది. పైగా ఆయ‌న ఏపీలోని ఫాస్ట‌ర్ల‌తో త‌ర‌చూ ఇటీవ‌ల క‌లుస్తున్నారు. ఆ క్ర‌మంలోనే తాజాగా రాజ‌మండ్రికి బ్ర‌ద‌ర్ అనిల్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. రెడ్డి సామాజిక వ‌ర్గం ఎలాగూ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటుంది. రెడ్డి ప్ల‌స్ ద‌ళిత క్రిస్టియ‌న్ల ఓటు బ్యాంకుతో ష‌ర్మిలకు ఏపీలో అనుకూలంగా ఉంటుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. అదే, తెలంగాణ రాష్ట్రంలోని ద‌ళితుల ప‌రిస్థితి భిన్నంగా ఉంది. క్రిస్టియ‌న్ కార్డ్ తెలంగాణ‌లో పెద్ద‌గా ప‌నిచేయ‌దు. ఒక వేళ చేసిన తాజాగా బీఎస్పీ త‌ర‌పున డాక్ట‌ర్ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రంగంలోకి దిగ‌డంతో గండిప‌డుతుంది. ద‌ళిత , క్రిస్టియ‌న్ల ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ప్ర‌వీణ్ వైపు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల తాజా అంచ‌నా. ఇక రెడ్డి సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పంచుకునే అవ‌కాశం ఉంది. సాలిడ్ గా ఏ పార్టీకి తెలంగాణ రెడ్డి సామాజిక‌వ‌ర్గం కొమ్ముకాసే ప‌రిస్థితి లేదు. ఇలాంటి ఈక్వేష‌న్ల‌న్నీ ప‌రిశీలించిన త‌రువాత ఏపీ వైపు ష‌ర్మిల అండ్ బ్ర‌ద‌ర్ అనిల్ దృష్టి పెట్టార‌ని టాక్.

రెండు నెల‌ల క్రితం రాజ‌కీయాల‌తో సంబంధంలేద‌న్న బ్ర‌ద‌ర్ అనిల్ ఇప్పుడు దేవుడి ఆదేశిస్తే..వ‌స్తాన‌ని చెబుతున్నాడు. పైగా ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతానంటూ ఆసక్తికర ట్వీస్ట్ ఇచ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్యా సుమారు గంట సేపు చర్చలు జ‌రిగాయి. పార్టీపరంగా, కుటుంబ పరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని బ్ర‌ద‌ర్ అనిల్ చెబుతున్నాడు. రాజకీయ జ్ఞానం నేర్చుకోవడం కోసమే ఉండవల్లితో భేటీ అయ్యాయ‌ని వెల్ల‌డించాడు. ఈ భేటీ సందర్భంగా విభజన కథ బుక్‌ను ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన విష‌యాన్ని తెలిపాడు. ఉండ‌వ‌ల్లి తో భేటీ వెన‌క ఏముంది అని అడిగితే మా సీక్రెట్స్ మాకు ఉంటాయ్ అంటూ అనిల్ చెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు దారితీస్తోంది. రెండు నెల‌ల క్రితం ఏపీలో పార్టీపై ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు బ్ర‌ద‌ర్ అనిల్ , ఉండ‌వ‌ల్లి భేటీలోని అంశాల‌ను ప‌రిశీలిస్తే..జ‌గ‌న్ కు పోటీగా ష‌ర్మిల దిగుతోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. బ్ర‌ద‌ర్ అనిల్ ఏపీలో రాజ‌కీయ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఉండ‌వ‌ల్లి లాంటి వైఎస్ అనుచ‌రుల‌తో భేటీ అయ్యాడ‌ని వినికిడి. బ్ర‌ద‌ర్ అనిల్ కూడా రాజ‌కీయాల్లోకి నేరుగా దిగే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆయ‌న‌ మాటల ద్వారా అర్థం అవుతోంది. మొత్తం మీద ష‌ర్మిల్ అండ్ బ్ర‌ద‌ర్ అనిల్ ఇద్ద‌రూ రాజ‌కీయ వేదిక‌పైన క‌నిపించ‌డానికి రంగం సిద్ధం అవుతోంది. ఇరు రాష్ట్రాల్లోనూ వాళ్లిద్ద‌రూ రాజ‌కీయ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న‌ట్టు జ‌రుగుతోన్న ప్ర‌చారానికి మ‌రికొన్ని రోజుల్లో క్లారీటీ రానుంది.