Pawan Kalyan : `జ‌న‌సేనాని` అమెరికా యాత్ర లోగుట్టు!

టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఆప‌రేష‌న్ అంతా అమెరికా నుంచి న‌డుస్తోంది. రెండేళ్ల క్రితం జ‌రిగిన తానా స‌భ‌ల స‌మ‌యంలోనే ఆ రెండు పార్టీల‌ పొత్తుపై తొలిసారి చ‌ర్చ జ‌రిగింది.

  • Written By:
  • Updated On - September 22, 2022 / 01:40 PM IST

టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఆప‌రేష‌న్ అంతా అమెరికా నుంచి న‌డుస్తోంది. రెండేళ్ల క్రితం జ‌రిగిన తానా స‌భ‌ల స‌మ‌యంలోనే ఆ రెండు పార్టీల‌ పొత్తుపై తొలిసారి చ‌ర్చ జ‌రిగింది. అక్క‌డ ఉన్న కీల‌క వ్య‌క్తులు ఈ రెండు పార్టీలు క‌లిసి వెళితేనే జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని దింప‌గ‌ల‌ర‌ని విశ్వ‌సిస్తున్నార‌ట‌. అందుకే, అమెరికా వేదిక‌గా `పొత్తు` అంశం అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌ను చూశాం. చంద్ర‌బాబునాయుడు కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా `వ‌న్ సైడ్ ల‌వ్‌` గురించి ప్ర‌స్తావించ‌డం, మంగ‌ళ‌గిరి జ‌న‌సేన ఆఫీస్ కు లోకేష్ వెళ్ల‌డం త‌దిత‌ర అంశాలు వెలుగుచూశాయి.

చెరిస‌గం అధికారాన్ని కోరే వ‌ర‌కు జ‌న‌సేన వెళ్లిన క్ర‌మంలో ఒంట‌రిగా ఎన్నిక‌లకు వెళ్ల‌డానికి టీడీపీ సిద్ధం అయింద‌ని తెలుస్తోంది. దీంతో జ‌న‌సేన ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక‌లా మారింది. బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. వైసీపీతో ఎలాగూ దూరంగా ఉంటుంది. ఇక ఒంట‌రిగా వెళితే 2 నుంచి 3 ఎమ్మెల్యేల‌ను క‌ష్టం మీద గెలుచుకుంటుంద‌ని స‌ర్వేల్లోని సారాంశం. అదే జ‌రిగితే, ఇక జ‌న‌సేన పార్టీ భ‌విష్య‌త్ లో ఉనికిని కోల్పోతుంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య టీడీపీతో పొత్తు అంశాన్ని తేల్చుకోవాల‌ని ప‌వ‌న్ అక‌స్మాత్తుగా అమెరికా ఫ్లైట్ ఎక్కాడ‌ని పార్టీ వ‌ర్గాల్లోని వినికిడి.

Also Read:   YS Sharmila:హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం సరికాదు: వైఎస్ షర్మిల

వాస్త‌వంగా అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి ప‌వ‌న్ బ‌స్సు యాత్ర చేయాలి. అందుకోసం జ‌న‌సైన్యం ఏర్పాట్ల‌ను కూడా చేసింది. కానీ, హ‌ఠాత్తుగా బ‌స్సు యాత్ర‌ను కాద‌ని అమెరికా ఫ్లైట్ ఆయ‌న ఎక్కార‌ట‌. కొంతమంది ప్రముఖులను క‌ల‌వ‌డం కోసం అర్జంటుగా అమెరికాకు పవన్ వెళ్లినట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజుల వరకూ పవన్ అమెరికాలోనే ఉండనున్నట్టు సమాచారం. ఆ రెండు రోజులు రాజకీయ భేటీలా? లేక సినిమాలపై భేటిలా? ఆర్థిక అవసరాలా? కోసం కేటాయిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు చిత్రం చివరి దశలో ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, వినోదయా సీతం రిమేక్ సెట్స్ మీద ఉన్నాయి. సురేందర్ రెడ్డి సినిమా ఒకటి అనుకుంటున్నారు. బస్సు యాత్ర లేకుంటే ఇవ‌న్నీ పూర్త‌వుతాయి.

ఎన్నిక‌ల‌కు 6 నెలలు ముందు నుంచి ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈసారి ఎలాగైనా జగన్ ను ఓడించడమే ధ్యేయంగా పవన్ ముందుకెళుతున్నారు. బస్సు యాత్ర వాయిదాతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా సినిమాల‌కు సంబంధించిన అంశమైతే, అమెరికా వెళ్లిన లోగుట్టు ఏమిటి? అనేది పెద్ద ప్ర‌శ్న‌. అక్క‌డ కొంద‌రు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఆయ‌న క‌లుస్తార‌ని తెలుస్తోంది. పార్టీ కోసం పెద్ద ఎత్తున ఫండింగ్ తీసుకురావ‌డానికి వెళ్లార‌ని పార్టీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాల చ‌ర్చ‌. తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు గురించి కూడా అక్క‌డే చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం కూడా ఉంది.

Also Read:   IFL Wealth Hurun Rich List 2022 : ఏపీ, తెలంగాణలో పెరిగిన‌ కుబేరులు

ఒక‌వేళ జ‌న‌సేన పొత్తు కావాల‌నుకుంటే, 15 స్థానాల‌కు మించి ఇచ్చేదిలేద‌ని టీడీపీ చెబుతోంది. క‌నీసం 50 చోట్ల పోటీ చేయ‌డానికి జ‌న‌సేన సిద్ధం అవుతోంది. ఆ మేర‌కు ఇటీవ‌ల ఒక స‌ర్వేను కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేసింది. అంతేకాదు, ప‌వ‌న్ సిఎం కావ‌డానికి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పొత్తు ఆ రెండు పార్టీల మ‌ధ్య కుద‌ర‌ని అంశం. వీట‌న్నింటిపై ఆమెరికాలోని పెద్ద‌ల‌తో చర్చించ‌డానికి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం ఉంది. మొత్తం మీద అధికారికంగా ఆయ‌న షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ప‌లు క‌థ‌నాలు ఆయ‌న అమెరికా టూర్ పై రావ‌డం మామూలే. ఇప్ప‌టికైనా జ‌న‌సేన అధికారికంగా ప‌వ‌న్ షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌క‌పోతే మ‌రిన్ని క‌థ‌నాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఊపందుకోవ‌డం స‌హ‌జం.