TDP – INDIA bloc : టీడీపీ లోక్‌సభ స్పీకర్ అభ్యర్థికి ‘ఇండియా’ మద్దతు : సంజయ్ రౌత్

శివసేన (ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - June 16, 2024 / 12:27 PM IST

TDP – INDIA bloc : శివసేన (ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 26న జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ఆయన ముఖ్యమైన కామెంట్స్ చేశారు. లోక్‌సభ స్పీకర్ పోస్టుకు ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ అభ్యర్థిని నిలబెడితే.. విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మద్దతు ఇస్తాయని ఆయన వెల్లడించారు. ‘‘ఒకవేళ లోక్‌సభ స్పీకర్ పదవి బీజేపీకి దక్కిితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. స్పీకర్ కుర్చీని వాడుకొని తదుపరిగా టీడీపీ, జేడీయూలను బీజేపీ చీల్చే అవకాశం ఉంటుంది’’ అని సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. అవసరం ఏర్పడితే చిరాగ్ పాశ్వాన్ రాజకీయ పార్టీ లోక్ జనశక్తి, జయంత్ చౌదరి రాజకీయ పార్టీ ఆర్‌ఎల్‌డీలను బీజేపీ చీల్చినా ఆశ్చర్యం ఉండదన్నారు.   ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ ఈ కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్ పదవికి టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టాలని మేం కోరుకుంటున్నాం. అదే జరిగితే ఇండియా కూటమి(TDP – INDIA bloc) మిత్రపక్షాలన్నీ కలిసి కూర్చొని చర్చించి.. టీడీపీకి మద్దతు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటాయి’’ అని రౌత్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసారి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరంగా ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తే..  గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే దిశగా ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు. ఏమేం జరుగుతున్నాయో అన్నీ తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మోడీని ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో నాయకుడిగా ఎన్నుకున్నారని, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్నుకోలేదని రౌత్ తెలిపారు. ‘‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగలేదు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో నాయకత్వ అంశం వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అందుకే ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మోడీని నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇది తీవ్రమైన విషయం’’ అని రౌత్ వ్యాఖ్యానించారు.

Also Read : Caller ID Display: తెలియని నంబర్‌ నుంచి కాల్స్‌ వస్తున్నాయా..? ఆ నెంబర్ ఎవరిదో ఇక పేరు కనిపిస్తుంది..!