Site icon HashtagU Telugu

Land Registration Charges : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు – మంత్రి అనగాని

Ap Land Registration

Ap Land Registration

ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు (Land Registration Charges ) అమలు కానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Revenue, Registration & Stamps Minister Satya Prasad) వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా సగటున 15% నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలపై సమగ్రంగా అధ్యయనం చేసి అధికారులు జనవరి 15నాటికి నివేదిక అందించాలని సూచించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆచరణీయమని తెలిపారు. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా నిర్ణయాలను అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పెంపు గణనీయంగా ఉండే అవకాశం ఉంది. అయితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇది సమర్థనీయంగా ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా, మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంపై ఇది ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త ఛార్జీలతో సంబంధిత శాఖలు మరింత సమర్థంగా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను కొనసాగిస్తూ, ప్రజలకు సేవల అందుబాటును పెంచడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ