Site icon HashtagU Telugu

AP News : జ‌గ‌న్ స‌ర్కార్ అరుదైన రికార్డ్ !అమెరికాకు పొగాకు ఎగుమ‌తి!!

Jagan mohan reddy

Jagan mohan reddy

వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రో చ‌రిత్ర‌ను సృష్టించింది. మార్కెఫెడ్ కొనుగోలు చేసిన వ‌ర్జీనియా పొగాకును అమెరికాకు ఎగుమ‌తి చేస్తూ సంచ‌ల‌న రికార్ట్ ను న‌మోదు చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ చోటుచేసుకోని ఈ ప‌రిణామం జ‌గ‌న్ స‌ర్కార్ ఖాతాలోకి వెళ్లింది. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసే రాష్ట్ర సంస్థ‌గా మార్కె ఫెడ్ సృష్టించిన చ‌రిత్ర దేశానికే త‌ల‌మానికం. ప్ర‌తి రాష్ట్రంలోనూ మార్క్ ఫెడ్ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌డం మామూలే. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేన‌ప్పుడు రైతుల‌ను ఆదుకోవ‌డానికి ఏర్ప‌డిన సంస్థ అది. ఏనాడూ ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతుల‌ను ఆదుకున్న దాఖ‌లాలు దాదాపుగా లేవు. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం మార్క్ ఫెడ్ చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని చెప్పాలి. దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రానికి చెందిన మార్క్ ఫెడ్ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు వాణిజ్య పంట‌గా ఉన్న పొగాకును కొనుగోలు చేయ‌లేదు. కానీ, మొద‌టి సారిగా ఏపీ మార్క్ ఫెడ్ 2019 కోవిడ్ సంద‌ర్భంగా రైతుల‌ను ఆదుకోవడానికి పొగాకు కొనుగోలు చేసింది. వ‌ర్జీనియా పొగాకు రైతుల‌ను చాలా వ‌ర‌కు ఆదుకోగ‌ల‌గ‌డ‌మే కాకుండా దేశానికి ఆద‌ర్శంగా జ‌గ‌న్ స‌ర్కార్ నిలిచింది.

వాస్త‌వంగా 2018 నుంచి పొగాకు మార్కెట్ త‌గ్గింది. ఆ విష‌యాన్ని తెలియ‌చేస్తూ కేంద్ర వాణిజ్య‌శాఖ‌కు ఏపీ ప్ర‌భుత్వం లేఖ‌లు రాసింది. రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరింది. కానీ, కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో రైతులు భారీగా న‌ష్ట‌పోయారు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత 2020లో మార్కెఫెడ్ ను రంగంలోకి దింపారు. సుమారు 13 మిలియ‌న్ కిలోల పొగాకును రైతుల నుంచి ఆ సంస్థ కొనుగోలు చేసింది. ఆ మొత్తంలో దాదాపు దేశీయ అవ‌స‌రాల కోసం 75శాతం నిల్వ‌ల‌ను అమ్మేసింది. మిగిలిన 120 ట‌న్నుల పొగాకును అమెరికాకు ఎగుమ‌తి చేసేందుకు ఏపీ స‌ర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేర‌కు నేరుగా ఎగుమ‌తి లైసెన్స్ ను పొందుతూ కాంట్రాక్టును కుదుర్చుకుంద‌ని టుబాకో బోర్డు ఎండీ ప్ర‌ద్యుమ్నా వెల్ల‌డించారు.

కేంద్రం నుంచి ఎలాంటి అనుమ‌తులు లేక‌పోయిన‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ ఆదేశం మేర‌కు మార్కెఫెడ్ ద్వారా వేలం కేంద్రాల‌కు వెళ్లి పొగాకు కొనుగోలు చేయ‌డం సాహ‌సమ‌ని ఎండీ అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సాహ‌సం ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌లేదు. పైగా కేంద్రంగా ఆధీనంలోని టుబాకో బోర్డు చేయాల్సిన ప‌నిని రాష్ట్ర మార్కెఫెడ్ చేసింది. ఇప్పుడు ఆ పొగాకును అమెరికాకు నేరుగా ఎగుమ‌తి చేయ‌డం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో జ‌గ‌న్ స‌ర్కార్ సాధించిన అత్యంత అరుదైన రికార్డ్ గా చెప్ప‌డం ఏ మాత్రం అతిశ‌యోక్తికాదు.