Sharadha peetham : మరోసారి ఏపీలో శారదా పీఠం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. పెద్ద ఎత్తున భూములు కేటాయించడం.. అలాగే తిరుమలలో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలులేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాన్ కు విరుద్దంగా నిర్మాణాలు ఎలా చేపడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠానికి ఆదేశాలు ఇచ్చింది. రూల్స్ ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు శారదాపీఠం తరుఫు న్యాయవాది గడువు కోరగా.. అంగీకరిస్తూ విచారణ వాయిదా వేసింది.
కాగా, శారదా పీఠం తిరుమలలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందంటూ తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శారదా పీఠం అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నా కూడా.. టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ను గతంలోనే విచారించిన ఏపీ హైకోర్టు భవన నిర్మాణాన్ని ఆపివేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది. అయితే పిటిషన్ మీద బుధవారం మరోసారి విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.