Rains : బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం…మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

కోస్తాంధ్ర‌,రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వ‌ల్ల మరో మూడు రోజుల్లో వ‌ర్షాలు విస్తారంగా కురుస్తాయ‌ని..

  • Written By:
  • Publish Date - October 29, 2021 / 11:08 AM IST

కోస్తాంధ్ర‌,రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వ‌ల్ల మరో మూడు రోజుల్లో వ‌ర్షాలు విస్తారంగా కురుస్తాయ‌ని..ఈ అల్ప‌పీడ‌నం త‌మిళ‌నాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది.ఆగ్నేయానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడి మరో మూడు రోజుల్లో పశ్చిమ దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, కేరళ, కోస్తా,దక్షిణ కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

దక్షిణాది రాష్ట్రాల్లో రామనాథపురం, తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, మైలాడుతురై, నాగపట్నం జిల్లాలు, కారైకాల్, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు కోస్తా, దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని IMD బులెటిన్ తెలిపింది

ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌రి పంట‌లు కోత‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ భారీవ‌ర్షాల‌తో రైతులు తీవ్ర‌న‌ష్టపోయే అవ‌కాశం ఉంది.ఇటు ప‌త్తి రైతులు కూడా ఆందోళ‌న‌లో ఉన్నారు.ఇప్పుడిప్పుడే ప‌త్తికి భారీగా ధ‌ర వ‌స్తుండ‌టంతో రైతులు కొంత ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.అయితే ఈ ఆకాల వ‌ర్షాల వ‌ల్ల తాము భారీగా న‌ష్టాన్ని చ‌విచూడాల్సి ఉంటుంద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.