పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడి రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలకు భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతోపాటు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ పేర్కొంది. వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని పాలనా యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు పాత భవనాలు, ఇళ్లలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ సూచించారు.