Rain Alert Today : ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఆనుకొని కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయు గుండంగా మారే అవకాశం ఉంది. ఈవిషయాన్ని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది. ఉరుములు, మెరుపులు సంభవించి పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అన్నారు. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి రేపు (గురువారం) ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర వాయుగుండంగా మారొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం నాటికి ఈ అల్పపీడనం ఒడిశా తీరానికి చేరుకుంటుంది. ఇక ఇవాళ హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కనిపించనుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా నమోదయ్యే (Rain Alert Today) అవకాశం ఉంది.