Site icon HashtagU Telugu

Thalliki Vandanam : ఈ మూడు పనులు చేస్తేనే రూ.15వేలు..లేదంటే అంతే సంగతి !!

Thallivandanam Update

Thallivandanam Update

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకం రేపటి నుంచి ప్రారంభంకానుంది. సూపర్ సిక్స్ (Super Six ) హామీల్లో భాగంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఈ నిధులు ఖాతాల్లోకి జమ కావాలంటే మూడు ముఖ్యమైన ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.

హౌస్ హోల్డ్ డేటా, ఈకేవైసీ, NPCI లింకింగ్ తప్పనిసరి

మొదటగా, తల్లి మరియు విద్యార్థి వివరాలు హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో నమోదు అయి ఉండాలి. అలా చేయని వారు తక్షణమే స్థానిక అధికారులను సంప్రదించి నమోదు చేయించుకోవాలి. రెండవది, తల్లి బ్యాంక్ ఖాతా ఈకేవైసీ (eKYC) పూర్తిగా చేయాలి. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ ప్రామాణికత గుర్తింపు సాధ్యం అవుతుంది. మూడవది, తల్లి అకౌంట్ NPCI (National Payments Corporation of India) తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింకింగ్ ద్వారా లబ్ధిదారుల నిర్ధారణ సులభమవుతుంది. ఈ మూడు ప్రక్రియలు పూర్తయ్యే వరకు డబ్బులు ఖాతాల్లో జమ చేయబడవు.

అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు

ఈ పథకం ప్రయోజనం పొందాలంటే విద్యార్థి తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలలో చదవాలి. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడే ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్లలో విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, తల్లి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం లేదా రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ సర్టిఫికెట్ (అవసరమైతే) మరియు పాఠశాల హాజరు సర్టిఫికెట్ ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ అర్హతలు నెరవేర్చిన వారు మాత్రమే “తల్లికి వందనం” ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం వర్తింప చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు రూ. 8,745 కోట్లు జమ చేయనుంది. 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థుల తల్లులు కూడా ఈ పథకం నుంచి లబ్ధి పొందనున్నారు. ఇంకా అడ్మిషన్ ప్రక్రియ పూర్తికాని విద్యార్థుల వివరాలు లభించగానే, వారి తల్లుల ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

93% విద్యార్థులకు లబ్ధి – జీ.ఓ విడుదల

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల్లో 93 శాతం మంది తల్లులకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 79 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ వరకు చదువుతుండగా, వారిలో 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింప చేస్తారు. మిగిలిన 7 శాతం విద్యార్థులు అత్యున్నత ఆదాయ వర్గానికి చెందినవారు కావడంతో వారికి పథకం వర్తించదు. పథకానికి సంబంధించిన విధివిధానాలను స్పష్టపరుస్తూ నేడు సంబంధిత అధికారుల ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు (జీ.ఓ) విడుదల చేయనున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 వంటి పథకాలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.