Site icon HashtagU Telugu

Pawan Kalyan: తాగేందుకు నీళ్ళు అడిగితే చంపేస్తారా..? పవన్ కళ్యాణ్ ఫైర్

Pawan Kalyan Own Goal

Pawan Kalyan Own Goal

Pawan Kalyan:

జనసేన అధినేత, సీని నటుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు మండిపడ్డారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్ళు పట్టుకొనేందుకు కూడా పార్టీల లెక్కల చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన కలచి వేసింది. ట్యాంకర్ దగ్గరకు తాగు నీరు పట్టుకొనేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్ళు పట్టుకోరాదు అని అడ్డుపడటం… ఇంట్లో నీళ్ళు లేవని ఆమె ప్రాధేయపడ్డా వినకుండా ట్రాక్టర్ తో ఢీ కొట్టి చంపడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తుందో అందరూ అర్థం చేసుకోవాలి’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘వైసీపీ వాళ్ళే నీళ్ళు తాగాలి… గాలి పీల్చాలి అని జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉంది. పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పాక్షపాతంగా, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలి’’ పవన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

‘‘మూడేళ్ళ కిందట ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనే నకరికల్లు ప్రాంతంలో ఎస్టీ మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు… నా ఎస్సీలు… అంటాడు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్ళను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ, నా ఎస్సీ అనే అర్హత ఉందా?’’ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.