ChandraBabuNaidu: బీజేపీ వద్దంటే..కాంగ్రెస్ కావాలంటుంది! రాహుల్ సభకు బాబుకు ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వీడినా ఆ పార్టీ ఆయన్ను వదల్లేదు.

  • Written By:
  • Publish Date - January 29, 2023 / 05:25 PM IST

ChandraBabuNaidu: కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వీడినా ఆ పార్టీ ఆయన్ను వదల్లేదు.
రాహుల్ గాంధీ భారత్ జోడో ముగింపు సభకు రావాలని లేఖ రాయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తుంది. బీజేపీ వద్దనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ను కావాలని కోరుకుంటుంది. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాలను మలుపు తిప్పనుందని టాక్. ఒక వేళ చంద్రబాబు రాహుల్ సభకు వెళితే పెద్ద హాట్ టాపిక్ దేశ రాజకీయాల్లో చోటు చేసుకోనుంది.

ఎన్డీయేతర పార్టీల అధిపతులు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివిధ పార్టీలకు లేఖలు రాశారు. మొత్తం 21 పార్టీల అధినేతను భారత జోడో యాత్ర ముగింపు సభకు రావాలని మల్లికార్జున ఖర్గే లేఖలు రాసినట్టు ఆ పార్టీ చెబుతోంది.
అయితే కాంగ్రెస్ అధినేత నుంచి టీడీపీకి కూడా ఆహ్వానం అందింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలుగా ఉన్నవారికి కాంగ్రెస్ ఈ ఆహ్వాన లేఖలు పంపిందని తెలుస్తోంది. జనవరి 30న శ్రీనగర్ లో రాహుల్ గాంధీ తన పాదయాత్రను విరమించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందుకున్న టీడీపీ ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు లక్ష్యమని చెబుతున్నారు. 2014లో ఏపీలో ఈ కూటమే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2024లో ఈ మూడు పార్టీలు కలసి అధికారం చేజిక్కుంచుకోవాలని చంద్రబాబు తలపోస్తున్నారు. ఇందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. టీడీపీ వైసీపీ రెండింటికి తమ పార్టీ దూరమని బీజేపీ చెబుతోంది. జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందని, జనసేన బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబకు లేఖ రాయడం ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ను విభజించాక ఏపీలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబుకు ఒనగూరేదేమీ లేదని అంటున్నారు. వచ్చే ఎన్నిల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల నాటికైనా బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా చంద్రబాబు శ్రీనగర్ సభకు వెళ్లే అవకాశం లేదని, అలాగే ఆ పార్టీ తరఫున కూడా ఎవరూ హాజరుకాబోరని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమిళనాడు సీఎం స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రులు ఉద్దవ థాక్రే అఖిలేష్ యాదవ్ మాయావతి తో పాటుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ టీ డీపీ అధినేత చంద్రబాబుకు ఖర్గే లేఖ రాసినట్టు తెలుస్తోంది.రాహుల్ గాంధీ యాత్ర ముగింపు సభ ద్వారా వచ్చే ఎన్నికల లక్ష్యాలను కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని అంటున్నారు. కలిసివస్తే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోందని అంటున్నారు.

2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. చంద్రబాబు నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

కన్యాకుమారిలో రాహుల్ తన పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ హరియాణా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ కు చేరుకుంది. జమ్ముకశ్మీర్ లోనే రాహుల్ తన పాదయాత్రను విరమించనున్నారు. ఆ సభ వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేయనుంది.