YS Rajasekhara Reddy: వైఎస్ ను పేదల గుండెల్లో నిలిపిన ఐఏఎస్

ఆరోగ్య‌శ్రీ సృష్టిక‌ర్త‌ను గుర్తించ‌ని తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్య‌పు నీడ‌లో ఆణిముత్యం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని నిరుపేద‌లు దైవంగా తీర్చిదిద్దిన ప‌థ‌క‌మే ఆరోగ్య‌శ్రీ‌.

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 10:36 PM IST

YS Rajasekhara Reddy : ఆరోగ్య‌శ్రీ సృష్టిక‌ర్త‌ను గుర్తించ‌ని తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్య‌పు నీడ‌లో ఆణిముత్యం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై. ఎస్‌. రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి (YS Rajasekhara Reddy) ని నిరుపేద‌లు దైవంగా తీర్చిదిద్దిన ప‌థ‌క‌మే ఆరోగ్య‌శ్రీ‌. అట్ట‌డుగున ఉన్న నిరుపేద‌ల‌కు కార్పొరేట్ వైద్యం అంటేనే తెలియ‌ని రోజుల్లో బ‌డుగు, బ‌ల‌హీన వర్గాల ప్రజ‌ల నాడిని ప‌ట్టుకొని చూసి… వారికి ఏది అవ‌స‌ర‌మే గుర్తించిన ఒక సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. ఆ అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో కాదు… ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి అంకురార్ప‌ణ చేసి, ఒక రాజ‌కీయ నాయ‌కుడ్ని దేశ వ్యాప్తంగా ఒక దైవంగా కొలిచేలా చేసిన వ్యక్తే… డాక్ట‌ర్ పి. వి. ర‌మేష్‌. ఐఏఎస్ కు ముందు వైద్య‌విద్య‌లో ప‌ట్టా పొంది డాక్ట‌ర్ ర‌మేష్‌… తాను చేసే ప్ర‌తీ ప‌నిలోనూ ఒక ప్ర‌త్యేక‌త ఉండాలనే త‌ప‌న‌తోనే అడుగులు వేసేవారు. ప్ర‌భుత్వంంలోని పెద్ద‌ల మ‌న్న‌న‌లకంటే.. పేద‌వారి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌న్న తాప‌త్ర‌యం ఆయ‌న వెన్నంటే ఉండేద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తిని… కాదు ఒక మ‌హా శ‌క్తిని తెలుగు రాష్ట్రాలు ఉప‌యోగించుకోలేక పోవ‌డం ఎంతో విడ్డూరం.

తెలుగు రాష్ట్రాల‌లోని రాజ‌కీయ నాయ‌కుల నుండి ప్ర‌భుత్వ అధికారుల వ‌ర‌కూ ఎంతో సుప‌రిచితులే.. దౌర్భాగ్యం ఏమిటో కానీ.. డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్ గారి సేవ‌ల‌ను మాత్రం తెలుగు ప్ర‌భుత్వాలు గుర్తించ‌క‌పోవ‌డం బాధాక‌రం. ముక్కుసూటిగా మాట్లాడే త‌త్వం.. నిర్మోహ‌మాటంగా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే స్వ‌భావం క‌లిగి డాక్ట‌ర్ ర‌మేష్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వంలో అనేక కీల‌క ప‌ద‌వుల‌ను నిర్వ‌హించి.. అటు నేత‌ల‌కు కాదు.. నిరుపేద‌ల‌కూ ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. నిజంగా ప‌నిచేసే వారికి ప్ర‌భుత్వాలు త‌గిన గుర్తింపు ఇవ్వ‌వు అనేందుకు డాక్ట‌ర్ పి. వి. ర‌మేష్ ఒక నిలెవెత్తు నిద‌ర్శ‌నమ‌నే చెప్పాలి.

డాక్ట‌ర్ ర‌మేష్ పూర్తి పేరు పి.వెంక‌ట ర‌మేష్ బాబు. 1960 జ‌న్మించిన డాక్ట‌ర్ ర‌మేష్‌.. 1985 బ్యాచ్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి ఐఏఎస్ అధికారి నియ‌మితుల‌య్యారు. అంత‌కు ముందు త‌మిళ‌నాడు రాష్ట్రంలోని క్రిష్టియ‌న్ మెడిక‌ల్ క‌ళాశాల‌లో ఎంబీబీఎస్ ప‌ట్టా పొందారు. ఐఏఎస్ అధికారిగా త‌న‌ 25 ఏళ్ల సుదీర్ఘ అనుభ‌వంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వంలోనే కాకుండా, కేంద్ర‌ప్ర‌భుత్వంలోనూ విశేష‌మైన సేవ‌లు అందించి పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్నారు. కేవ‌లం రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల‌లోనే కాకుండా అంత‌ర్జాతీయ స్థాయిలోని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేశారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్తో పాటు అనేక దేశాలలో ఐఎఫ్ఏడీ, యూఎన్‌డీపీ, యూఎన్ఒడీసీ, యూఎన్ఎఫ్‌పీఏ, సంస్థ‌ల ద్వారా నిధులు సమకూర్చడంలో కీల‌క పాత్ర పోషించారు.

అంత‌ర్జాతీయ‌సంస్థ‌ల స‌హాయ స‌హ‌కారంతో చేప‌ట్టిన నిధుల స‌మీక‌ర‌ణ‌తో గ్రామీణాభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన ప్రాజెక్టుల రూపకల్పన, పర్యవేక్షణ, మూల్యాంకనం, నిధుల నిర్వహణకు డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. భారతదేశం, ఇండోనేషియా, ఇరాక్, కెన్యా, మాల్దీవులు, మలేషియా, మయన్మార్, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు US. UNO తో పనిచేసిన సమయంలో, డాక్ట‌ర్ ర‌మేష్ శ్రీలంకలో కంట్రీ ప్రోగ్రామ్ మేనేజర్ ఐఎఫ్ఏడీ, నైరోబీ, కెన్యాలో ఉన్న యూఎన్ఓపీఎస్ జాతీయ కార్యాలయం యొక్క కోఆర్డినేటర్ గా… యాక్టింగ్ డైరెక్టర్‌గా ప‌నిచేయ‌డమే కాకుండా, కాబూల్‌లోని UNFPA కోసం దేశ ప్రతినిధిగా కీల‌క ప‌ద‌వుల‌ను, ఉన్న‌త స్థానాల్లో ప‌నిచేశారు డాక్ట‌ర్ ర‌మేష్‌.

డాక్ట‌ర్ పి. వి. ర‌మేష్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా సబ్ కలెక్టర్ మరియు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ గా 1987–1989 మ‌ధ్య కాలంలో ప‌నిచేశారు. ఆ త‌రువాత వివిధ జిల్లాల‌కు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా… క‌లెక్ట‌ర్‌గా… ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి త‌న‌దైన శైలిని క‌న‌బ‌రిచారు. కేవ‌లం వైద్యాధికారిగా… ఐఏఎస్ అధికారిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డ‌మే కాకుండా స‌మాజాభివృద్ధికి తాను కీల‌క పాత్ర పోషించాల‌నే త‌ప‌న డాక్ట‌ర్ ర‌మేష్ లో వెన్నంటి నీడ‌లా ఉంటూ ఉండేది. అదే స్పూర్తితో ఆయ‌న కీల‌క అంశాల‌పై ర‌చ‌న‌లు చేప‌ట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌లో నిరుపేద రైతుల అభ్యున్న‌తికి తోప్ప‌డే విధంగా “ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర వ్యవసాయ సంస్కరణల అమలు” అనే వ్యాసం డాక్ట‌ర్ ర‌మేష్ కు ఎంతో కీర్తిని సంపాధించింది. ఆ త‌రువాత 2005 – 2006లో హైదరాబాద్ లోని అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు CEO గా బాధ్య‌త‌లు చేప‌ట్టి అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు.

డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ్‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా 2004లో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత డాక్ట‌ర్ పి. వి. ర‌మేష్ ప‌నితీరును ప‌సిగ‌ట్టిన సీఎం వై. ఎస్. రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి (YS Rajasekhara Reddy) 2006లో ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గా నియ‌మించారు. వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న కాలంలోనే డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్ కీల‌క అంశాల‌పై నేరుగా ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం వై. ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి (YS Rajasekhara Reddy) తో చ‌ర్చిస్తూ ఉండేవారు. రైతుల‌కు ఉచిత విద్యుత్‌ స‌ర‌ఫ‌రా అన్న అంశంతో 2004లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో భవిష్య‌త్తులోనూ అధికారం త‌మ‌పార్టీ చేతుల్లో నుండి జారిపోకుడ‌ద‌న్న బ‌ల‌మైన అంశం పుట్టుకు రావ‌డంతో.. నాటి రాష్ట్ర ప్ర‌భుత్వ వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్ మేధోసంప‌త్తి నుండి పుట్టిందే… ఆరోగ్య‌శ్రీ‌.

ఈ ప‌థ‌కం గురించి నాటి ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ఆర్‌కు చెప్ప‌డంతో.. త‌క్ష‌ణ‌మే పూర్తి స్థాయిలో ప‌థ‌కాన్ని రూపొందించాల‌ని ఆదేశించారు. దాదాపు మూడు నెల‌ల‌పాటు వివిధ శాఖ‌ల అధికారుల‌తో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు.. స‌మావేశాలు నిర్వ‌హించిన త‌రువాత తెలుగు రాష్ట్రాల‌లోని నిర‌పేద‌ల‌కు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం అందుబాటులోకి వ‌చ్చింది. అయితే అక్ష‌ర‌రూపంతో ప్రారంభించి.. కార్యాచ‌ర‌ణ వ‌ర‌కూ నిరంత‌రం.. అనుక్ష‌ణం శ్ర‌మించిన డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్ ను తెలుగు రాష్ట్రాల‌లోని ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేశాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. కేవ‌లం ఆరోగ్య‌శ్రీ‌తోనే డాక్ట‌ర్ ర‌మేష్ ఆలోచ‌న‌లు నిలిచిలోలేదు.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదలకు ప్రయోజనం చేకూర్చే పథ‌కాలైన 104 మొబైల్ వైద్య‌ సేవల‌తో పాటు, 108 ఉచిత అంబులెన్స్ సేవ‌ల‌కు సంబంధించిన ప‌థ‌కానికి కూడా డాక్ట‌ర్ ర‌మేష్ ప్రధాన రూపశిల్పి.

ఒకానొక‌ద‌శ‌లో త‌న‌కు సంబంధం లేని శాఖ‌ను కేటాయిండంతో సుదీర్ఘ‌సెల‌వు పెట్టి వెళ్లిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని రూపొందించిన త‌రువాత 2007లో డాక్ట‌ర్ ర‌మేష్ యునైటెడ్ నేష‌న్స్ ఫండ్ ఫ‌ర్ పాపులేష‌న్ యాక్టివిటీస్ సంస్థ‌ (UNFPA) భార‌త‌దేశ ప్ర‌తినిధిగా విధులు నిర్వ‌ర్తించారు. రెండేళ్ల అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వ సేవ‌ల్లో తిరిగి చేరిన త‌రువాత రాష్ట్ర వైద్య ఆరోగ్య‌కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి 2010 లో సేవ‌లు పునః ప్రారంభించారు. ప‌దోన్న‌తుల్లో భాగంగా డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో సేవ‌లు అందించారు.

అలాగే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన త‌న‌దైన‌శైలిలో ప్ర‌త్యేక ముద్ర‌ను వేశారు. ఆనూహ్య ప‌రిణామాల మ‌ధ్య డాక్ట‌ర్ పి. వి. ర‌మేష్‌ను రాష్ట్ర యువజన వ్యవహారాలు మరియు సాంస్కృతిక‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా ప్రభుత్వం 2011 ఆగస్టులో నియ‌మించ‌డంతో డాక్ట‌ర్ ర‌మేష్ తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. దీంతో ఆయ‌న సుదీర్ఘ సెల‌వుపెట్టి వెళ్లిపోయారు. విష‌యం తెలుసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగి 2012 జ‌న‌వ‌రిలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆర్థిక‌శాఖ ముఖ్య‌కార్యద‌ర్శిగా నియ‌మించింది.

ఎంతో నైపుణ్యం క‌లిగిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, వైద్య‌వృత్తివిద్యా కోర్సును పూర్తి చేసుకున్న డాక్ట‌ర్ పీ. వి. ర‌మేష్‌ను తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌గిన గుర్తింపును ఇవ్వ‌క‌పోగా.. ఆయ‌న‌కు ఎటువంటి అవార్డులు.. రివార్డులకు సిఫార్సు చేయ‌క‌పోవ‌డం చూస్తుంటే.. రాజ‌కీయ నాయ‌కుల‌కు కావ‌ల‌సింది ప‌ద‌వి.. అధికార‌మే త‌ప్ప‌.. జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో త‌మ‌కు గుర్తింపు తీసుకువ‌చ్చిన వ్య‌క్తులు.. అధికారుల‌ను చీక‌టి గుహ‌ల్లో బంధించ‌డ‌మే త‌ప్ప‌ ప్రోత్స‌హించ‌ర‌నేది డాక్ట‌ర్ పీ. వీ. ర‌మేష్ సేవా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ సేవలను వినియోగించికుంటే పేదలకు మేలు. ప్రభుత్వానికి పేరు మిగులుతుంది.

Also Read:  TDP – Janasena: టిడిపి – జ‌న‌సేన మ‌ధ్య ఢిల్లీ గిల్లుడు