IAS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
♦ రెవెన్యూ, భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆర్పీ సిసోడియా చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
♦ సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.
♦ ఐటీశాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి ఏపీ హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
♦ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా ముత్యాలరాజును నియమించింది.
♦ రైతు బజార్ల సీఈవోగా కే మాధవీలత.
♦ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని నియమించింది.
♦ ఆయుష్ డైరెక్టర్‌గా దినేష్ కుమార్.
♦ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిసోడియా బదిలీకి కారణం అదేనా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెవెన్యూశాఖాధిపతిగా ఆర్‌పీ సిసోడియాను నియమించింది. వైఎస్ జగన్ పాలనలో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి అనేక అవకతవకలు, అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సీనియర్ ఐఏఎస్ అయిన సిసోడియాను ఆశాఖలో నియమించింది. అయితే, సిసోడియా ప్రభుత్వం అనుకున్న రీతిలో పని చేయలేకపోయారన్న వాదన ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజల నుంచి వస్తున్న భూ సమస్యలకు పరిష్కరించలేకపోవడం, శాఖలో ఆయన పనితీరుపై విమర్శలు ఉండడంతో ఆయనపై బదిలీ వేటుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం చేనేత, వస్త్రపరిశ్రమ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియాను ప్రభుత్వం నియమించింది. సిసోడియా నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖను జి.జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా కె. దినేశ్ కుమార్ కొనసాగిన సమయంలో ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డితో విబేధాలు తలెత్తాయి. దీంతో జీవీ రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం పైబర్ నెట్ ఎండీ పదవి నుంచి కె. దినేశ్ కుమార్ ను తొలగించిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన స్థానంలో ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. అయితే, ప్రస్తుతం ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కె. దినేష్ కుమార్ ను ఆయుష్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.నీలకంఠారెడ్డికి ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.