Site icon HashtagU Telugu

YS Sharmila : ఆమరణ దీక్షకు దిగుతా.. వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన

I will go on a fast unto death.. YS Sharmila's key statement

I will go on a fast unto death.. YS Sharmila's key statement

YS Sharmila : విశాఖపట్నంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో నేడు వైఎస్‌ షర్మిల చేసిన సంచలన ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల హక్కుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్లాంట్ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని తీవ్రంగా తప్పుబడుతూ, కార్మికులపై జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేమన్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్‌లో జరుగుతున్న కార్యకలాపాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షర్మిల, “కార్మికుల సమస్యలపై కనీసం దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవడం లేదంటే, యాజమాన్య ధోరణి ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవాలి” అని విమర్శించారు. ప్రస్తుతం సమ్మె బాట పట్టిన కార్మికుల డిమాండ్లు పూర్తి న్యాయమైనవని ఆమె పేర్కొన్నారు. కనీసమైన కనికరం లేకుండా, బాధ్యత లేకుండా యాజమాన్యం వ్యవహరిస్తోందని విమర్శల వర్షం కురిపించారు.

Read Also: Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?

“ఇప్పటికే 2 వేల కాంట్రాక్ట్ కార్మికులను రోడ్డుపాలయ్యేలా చేసిన యాజమాన్యం, మరో 3 వేల మందిని తొలగించేందుకు కుట్రలు చేస్తోంది. ఈ చర్యలు దారుణమైనవే కాక, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడటమే. అంతే కాదు, తమ హక్కులను కోరిన కార్మికులను సస్పెండ్ చేయడం పట్ల ఎంతటి బాధ్యతాహీన ధోరణి ఉన్నదో చూస్తున్నాం” అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఆమె కఠినమైన అల్టిమేటం ఇచ్చారు. “రేపటిలోగా తొలగించిన 2 వేల కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి. అలాగే 2021లో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. SAIL లో స్టీల్ ప్లాంట్ విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయాలి” అని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్లను తక్షణం నెరవేర్చకపోతే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక, మే 21వ తేదీ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ గేటు ఎదుటే ఆమరణ దీక్షకు దిగుతానని షర్మిల ఘనంగా ప్రకటించారు. “ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు. దీనిని కాపాడేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధం” అని ఆమె హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం మరింత ఉధృతం కానుంది. కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ రేగే అవకాశముంది. షర్మిల చేపట్టబోయే దీక్షకు రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Read Also: TDP : టీడీపీ కార్యకర్తపై దాడి కేసు.. మంగళగిరి కోర్టుకు నందిగం సురేశ్‌