Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం: నాదెండ్ల

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారకముందే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలోనూ స్థానిక ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చ ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని, పార్టీ బలాబలాల ఆధారంగానే పోటీ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ […]

Published By: HashtagU Telugu Desk
I will definitely contest the local elections: Nadendla

I will definitely contest the local elections: Nadendla

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారకముందే స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలోనూ స్థానిక ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చ ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని, పార్టీ బలాబలాల ఆధారంగానే పోటీ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ అధినేత పవన్ కల్యాణ్ పొత్తు నిర్ణయం తీసుకున్నారని మనోహర్ గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో జనసేన కొన్ని సీట్లలో సర్దుకుపోయిందని, నాలుగు అడుగులు వెనక్కి తగ్గిందని అన్నారు. అయితే, ఆ త్యాగాన్ని స్థానిక ఎన్నికల్లోనూ ఆశిస్తే పొరపాటేనని ఆయన స్ప‌ష్టం చేశారు.

“సార్వత్రిక ఎన్నికల ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటుందనడం సరికాదు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలం ఆధారంగానే మా పోటీ ఉంటుంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే, జనసేన బలంగా ఉన్నచోట ఖచ్చితంగా పోటీ చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పార్టీ బలోపేతం, కార్యకర్తలకు అవకాశాలు కల్పించడంపై కూడా జనసేన దృష్టి సారించింది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి స్థానిక ఎన్నికల్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని మనోహర్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు ‘జనసేన పార్టీ చర్చావేదిక’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని రాష్ట్రంలో తొలిసారిగా కైకలూరు నుంచి మొదలుపెట్టినట్లు ఆయన ప్రకటించారు. ఈ వేదిక ద్వారా గ్రామస్థాయిలో కార్యకర్తల ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు వైసీపీ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొడతామని వివరించారు.

కూటమిగా కలిసి పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు, అభిప్రాయభేదాలు సహజమని, వాటిని సర్దుకుని ముందుకు సాగాలని జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమిలోని అన్ని పార్టీల శ్రేణులు అంకితభావంతో కలిసికట్టుగా పనిచేసి, ప్రభుత్వానికి అండగా నిలవాలని మనోహర్ సూచించారు. మొత్తం మీద స్థానిక ఎన్నికల్లో జనసేన మరింత కీలక పాత్ర పోషించాలని భావిస్తోందని, సీట్ల పంపకాల్లో గట్టిగా బేరమాడేందుకు సిద్ధమవుతోందని మనోహర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

 

  Last Updated: 17 Jul 2026, 01:50 PM IST