New Districts: ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆర్టిక‌ల్‌తో జిల్లాల విభ‌జ‌న‌కు చిక్కులే!

వివిధ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రాజ్యాంగంలో కొన్ని రాష్ట్రాల‌కు కొన్ని ప్రత్యేక నిబంధ‌న‌లు రూపొందించారు. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 371d ఆర్టిక‌ల్ ఉంది.

  • Written By:
  • Publish Date - February 24, 2022 / 08:19 AM IST

వివిధ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని రాజ్యాంగంలో కొన్ని రాష్ట్రాల‌కు కొన్ని ప్రత్యేక నిబంధ‌న‌లు రూపొందించారు. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 371d ఆర్టిక‌ల్ ఉంది. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పట్లో ఆరు జోన్లుగా విభ‌జించారు. విద్యా సంస్థల్లో అడ్మిష‌న్లు, ఉద్యోగాలు, బ‌దిలీలు.. ఇంకా ఇతర అంశాల్లో ఈ జోన‌ల్ సిస్టంను క‌చ్చితంగా పాటించ‌క త‌ప్పదు. రాజ్యాంగానికి సంబంధించిన అంశం కావ‌డంతో ఈ వ్యవ‌స్థ ఏర్పాటుపై రాష్ట్రప‌తి నుంచి ఉత్తర్వులు వ‌చ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసే స‌మ‌యంలో జోన‌ల్ విధానాన్ని త‌ప్పకుండా ప‌రిశీల‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఎన్నో చిక్కులు ఎదుర‌వుతాయి. ఇప్పటి వ‌ర‌కు అమ‌ల్లో ఉన్న జోన్లను మార్చకుండా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే పెద్దగా స‌మ‌స్యలు ఉండ‌వు.

అదే ఒక జోన్‌లో ఉన్న కొంత భాగాన్ని, మ‌రో జోన్‌లో ఉన్న ఇంకొంత భాగాన్ని క‌లిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయాల‌నుకుంటే మాత్రం ఇబ్బందులు త‌ప్పవు. ఇందుకు త‌ప్పనిస‌రిగా రాష్ట్రప‌తి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎంతో ప్రక్రియ ఉండ‌డంతో సమ‌యం తీసుకుంటుంది.

రెండు జోన్లలోని ప్రాంతాల‌ను క‌లిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసిన‌ప్పుడు దానిని ఏదో ఒక జోన్‌లో ఉంచాల్సి ఉంటుంది. అలా చేసిప్పుడు తాము స్థానికత‌ను కోల్పోయి న‌ష్టపోయామంటూ ఎవ‌రైనా కోర్టుల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.
వీట‌న్నింటినీ ప‌రిశీలించి కొత్త జిల్లాల స‌రిహ‌ద్దుల‌ను నిర్ణయించి, రాష్ట్రప‌తి వ‌ద్దకు ప్రతిపాద‌న‌లు పంపితేనే స‌కాలంలో ఆమోదం లభిస్తుంది.

తెలంగాణ‌లో జిల్లాలు విభ‌జించిన‌ప్పడు ఈ ప‌రిస్థితిని అధిగ‌మించ‌డానికి మ‌ల్టీ జోన‌ల్‌, జోన‌ల్ విధానాల‌ను తీసుకువ‌చ్చారు. అయితే దీని వ‌ల్ల త‌మ లోక‌ల్ స్టేట‌స్ మారింద‌ని, ఉద్యోగాలు, బ‌దిలీలు, ప్రమోష‌న్లలో న‌ష్టం జ‌రిగిందంటూ ప్రభుత్వానికి ఇంకా ఫిర్యాదులు అందుతునే ఉన్నాయి. తెలంగాణ అనుభ‌వాల‌ను ప‌రిశీలించిన త‌రువాతే ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకు వెళ్లాల‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.