కాకినాడ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో గత రెండేళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ సిట్ అధికారులు సంచలన నిజాలను బయటపెట్టారు. ఈ హత్యలో అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గ (రోజా) కీలక పాత్ర పోషించారని నిర్ధారిస్తూ ఆమెను రెండో నిందితురాలిగా (A-2) చేరుస్తూ రాజమహేంద్రవరం కోర్టులో అదనపు అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. 2022లో జరిగిన ఈ హత్య కేవలం ఆవేశంలో చేసింది కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిందని, ఇందులో లక్ష్మీ దుర్గ తన భర్తను నేరానికి పురికొల్పడమే కాకుండా సాక్ష్యాల ధ్వంసంలోనూ పాలుపంచుకున్నారని సిట్ ఆధారాలతో సహా నిరూపించింది.
గతంలో పోలీసుల విచారణ సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని లక్ష్మీ దుర్గ చెప్పిన మాటలు అబద్ధమని సిట్ దర్యాప్తులో తేలింది. సిట్ అధికారులు సుమారు 14 ప్రాంతాల నుండి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించగా, హత్య జరిగిన రోజు రాత్రి ఆమె ఘటనా స్థలంలోనే ఉన్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా, హత్యకు ముందు అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కుమార్తెను ఒక పెద్ద కర్ర కావాలని అడిగి తీసుకోవడం, హత్య అనంతరం మృతదేహాన్ని తరలించిన కారులో అనంతబాబుతో కలిసి ప్రయాణించడం వంటి ఆధారాలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. సాక్ష్యాలను మాయం చేసి, మృతదేహాన్ని బాధితుడి ఇంటి వద్ద పడేసే వరకు ఆమె అన్నింటా వెన్నంటే ఉన్నట్లు సిట్ అభియోగపత్రంలో పేర్కొంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ నామమాత్రంగా సాగిందని, కీలకమైన సాంకేతిక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని సిట్ ఆరోపించింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్, నిగ్గు తేల్చిన నిజాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రూ. 20 వేల బకాయి కోసం ప్రాణాలు తీసి, అనంతరం రూ. 2 లక్షలు ఇస్తామని కుటుంబ సభ్యులను బెదిరించిన వైనాన్ని సిట్ పూసగుచ్చినట్లు వివరించింది. ప్రస్తుతం ఏ-2గా నమోదైన లక్ష్మీ దుర్గ పరారీలో ఉండగా, ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడుతున్న బాధితులకు సిట్ దర్యాప్తు కొత్త ఆశలను కల్పించింది.
