AP Elections : ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి 12 గంటల సమయానికి భారీగా 78.36 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, నంద్యాల, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో 80 శాతానికిపైగా ఓటింగ్ జరిగింది. ఈ భారీ పోలింగ్ దేనికి సంకేతం ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇంత భారీగా ఓటింగ్ జరగడం అనేది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే ఈ పోలింగ్ సరళిపై(AP Elections) ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఏపీలో పోలింగ్ శాతం పెరగడంపై అధికార వైఎస్సార్ సీపీ నుంచి ఎలాంటి స్పందన కానరాలేదు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వంటివారు మీడియాతో మాట్లాడినా సానుకూల వైఖరిని మాత్రం వ్యక్తం చేయలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలో 79 శాతం పోలింగ్ నమోదైతే ప్రతిపక్షానికి కలిసొచ్చింది. అప్పట్లో వైఎస్సార్ సీపీ భారీ ఫలితాలను సాధించి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అంతే రేంజులో పోలింగ్ జరగడం.. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ – జనసేన – టీడీపీ కూటమికి కలిసి రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే టీడీపీ వర్గాలు స్పందిస్తున్నాయి. భారీ పోలింగ్ అనేది వైఎస్సార్ సీపీ సర్కారుపై ఉన్న వ్యతిరేకతకు చిహ్నమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. సోమవారం రోజు ఎండ కొంచెం తక్కువగా ఉండటం వల్ల కూడా పోలింగ్ శాతం పెరిగిందని మరికొందరు అంటున్నారు.
Also Read :Billboard Horror : హోర్డింగ్ హారర్.. 14 మంది బలి.. 65 మందికి గాయాలు
సరైన సమయంలో జనసేన, బీజేపీలతో టీడీపీ జట్టుకట్టడం, చాలా ముందుగా మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం ఈసారి కూటమికి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయనే టాక్ ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా బీజేపీ అగ్రనేతలూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఈసారి కూటమికి అదనపు బలంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ అగ్రనేత నారా లోకేష్‌లు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈమేరకు వారు ఓటర్లకు శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలిపారు.కూటమిలో మరో పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే విధమైన వ్యాఖ్య చేశారు. ఓటింగ్ శాతం పెరుగుతుండడం సంతోషమని, ఇది కూటమి విజయానికి ప్రజలు ఇస్తున్న ఆశీర్వాదమని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ అసలు ఫలితం కోసం మనం జూన్ 4 దాకా వేచిచూడాల్సిందే.