HUDCO : రాజధాని అమరావతి నిర్మాణానికి ₹11,000 కోట్లను విడుదల చేయడానికి హడ్కో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ మేరకు ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏపీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.10 వేల కోట్లకు పైగా రుణాలు ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా హడ్కో రుణంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు వేగవంతమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు. ఈ నేపథ్యంలో, తాజాగా ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.
ఇకపోతే.. కేంద్రంలో ఎన్డీయే సర్కార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో సైతం అమరావతి నిర్మాణానికి నిధులు సైతం కేటాయిస్తుంది. ఇక దేశీ, విదేశీ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కేబినెట్ సహచరులు దావోస్‌లో పర్యటిస్తున్నారు.
Read Also: ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లో బుమ్రా, జడేజా