TDP : టీడీపీ`పై కుబేరుల నీడ

మూడు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌లంద‌రికీ ప‌రిచ‌య‌మైన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా రాజ‌కీయ సంచ‌ల‌నాల‌ను కూడా సృష్టించింది.

  • Written By:
  • Updated On - December 13, 2021 / 01:55 PM IST

మూడు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌లంద‌రికీ ప‌రిచ‌య‌మైన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా రాజ‌కీయ సంచ‌ల‌నాల‌ను కూడా సృష్టించింది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాంలో రాజ‌కీయ రికార్డ‌ల మోత మోగించింది. ఆ త‌రువాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ పార్ల‌మెంట్లో ప్రధాన ప్ర‌తిప‌క్షంగా ప‌నిచేసింది. ప్ర‌ధాన మంత్రి, రాష్ట్ర‌ప‌తి లాంటి కీల‌క ప‌ద‌వులకు అభ్య‌ర్థుల ఎంపిక ఆ పార్టీ మీద ఆధార‌ప‌డి ఉండేది. కానీ ఇప్పుడు పూర్తి భిన్నమైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా పిలుచుకుంటున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి ప‌డిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన‌, లోక్ స‌త్తా, క‌మ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీ, తెలంగాణ జ‌న‌స‌మితి త‌దిత‌ర చిన్నాచిత‌క పార్టీల జాబితాలోకి వెళ్లిపోయింది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014వ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో 19 మంది ఎమ్మెల్యేలు (బీజేపీ, టీడీపీ క‌లిపి) ఉన్నారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు తెలుగుదేశం పార్టీని లేకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ చేయ‌గ‌లిగింది. కొత్త సీసాలో పాత సారా మాదిరిగా టీఆర్ఎస్ పార్టీలోని 80శాతం మంది టీడీపీ తెలంగాణ లీడ‌ర్లే. తెలుగుదేశం పార్టీ బీ టీమ్ గా గులాబీ ద‌ళం ఉంది. 2019 ఎన్నిక‌ల తరువాత తెలుగుదేశం పార్టీ ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల‌కు ప‌రిమితం అయింది. అయిన‌ప్ప‌టికీ ఓట్ల శాతం ప‌రంగా మెరుగ్గానే ఉంది. కానీ, లీడ‌ర్ల వాల‌కం, చంద్ర‌బాబు విధాన‌ప‌ర‌మైన కొన్ని త‌ప్పిదాలు ఏపీలోనూ ఆ పార్టీని వెంటాడుతున్నాయి. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు డ‌బ్బున్న లీడ‌ర్లు చాలా త‌క్కువ‌. పారిశ్రామిక‌, వ్యాపార‌వేత్త‌ల‌ను ఎన్టీఆర్ దూరంగా పెట్టాడు. విద్యావేత్త‌లు, వివిధ రంగాల్లోని నిపుణులు, విద్యార్థి నాయ‌కులు పార్టీలో కీల‌కంగా ఉండే వాళ్లు.

చంద్ర‌బాబు హ‌యాం (1999)నుంచి పార్టీలోకి ధ‌నికులు జోర‌బ‌డ్డారు. పార్టీని అడ్డుపెట్టుకుని వ్యాపారాలను విస్త‌రింప చేసుకునే వాళ్ల పెత్త‌నం పెరిగింది. 1983లో ఏపీ నుంచి టీ అమ్ముకోవ‌డానికి, సిలెంండ‌ర్లు వేయ‌డానికి, పాత సామాను విక్ర‌య‌యానికి హైద‌రాబాద్ కు వ‌చ్చిన వాళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో రియ‌ల్డ‌ర్లు, వ్యాపారులు, బ్రోక‌ర్లుగా మారారు. కాల క్ర‌మంలో రాజ్య‌స‌భ‌, లోక్ స‌భ‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా అవ‌తారం ఎత్తారు. పార్టీ ఆఫీస్ కు ఎవ‌రైనా వ‌స్తే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోణంలో చూశారు మిన‌హా తెలుగుదేశం పార్టీ కోసం ఆలోచించ‌లేదు. క్లాస్ ఒన్ కాంట్రాక్టర్లుగా తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకుని ఎదిగిన కొంద‌రు క్యాడ‌ర్ కు స‌బ్ కాంట్రాక్టులు ఇచ్చి డ‌బ్బు తిరిగి ఇవ్వ‌కుండా నిండా ముంచేశారు. ఇలా..ప‌లు ర‌కాలుగా హైద‌రాబాద్ టీడీపీ కేంద్ర కార్యాల‌యం వ్యాపార కేంద్రంగా మారింద‌ని పార్టీ వ‌ర్గాల్లోనే అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రుగుతూ ఉండేది.

సాధార‌ణంగా ఉన్న‌త స్థితిలో ఉన్న ధ‌నిక లీడ‌ర్లు కింద స్థాయిని ఆదుకోవాలి. కానీ, చంద్ర‌బాబు మిన‌హా ఆయన కోట‌రీగా చెప్పుకుంటున్న చాలా మంది కోర్ క్యాడ‌ర్ ను క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ లోనే చూశారు. పైగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడ‌ర్లు జెండా క‌ట్టాల‌న్నా…పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి డ‌బ్బు డ్రా చేసుకునే దుస్థితికి వెళ్లింది. పార్టీ ఆఫీస్ కు రావ‌డానికి డీజిల్, పెట్రోలును కూడా డిమాండ్ చేసిన లీడ‌ర్లు ఉన్నారని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించే స్థాయికి పార్టీ విలువ‌లు ప‌డిపోయాయి.

ప్ర‌స్తుతం ఏపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన టీడీపీ కొంద‌రు ధ‌నికులు క‌బంధ హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక పోతోంది. పార్టీని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు విస్త‌రింప చేసుకోవ‌డానికి చంద్ర‌బాబు కోట‌రీగా ఉన్న కొంద‌రు ఇప్ప‌టికీ బిజీగా మారారు. వాళ్ల‌కు కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు తోడ‌య్యారు. వాస్త‌వాలకు దూరంగా ఎప్ప‌టిప్పుడు చంద్ర‌బాబును ఉంచుతూ పార్టీ ప‌త‌నానికి మూల స్థంభాలుగా ఉన్నార‌ని ఒక వ‌ర్గం క్యాడ‌ర్ బాధ ప‌డుతోంది. ఒక‌ప్పుడు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు సొంతం చేసుకున్న పార్టీ టీడీపీ. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఏనాడూ పారిశ్రామిక‌, వ్యాపార‌వేత్త‌ల‌ను ముందుంచి పార్టీని న‌డ‌ప‌లేదు. పైగా పార్టీ కార్యాల‌యానికి వాళ్ల‌ను దూరంగా పెట్టాడు. మీడియాను ఎంత వ‌ర‌కు ఉంచాలో..అంత వ‌ర‌కు ప‌రిమితం చేశాడు. ప్ర‌జ‌ల్ని న‌మ్ముకున్న ఎన్టీఆర్ ఏనాడూ పార్టీలో ఓడిపోలేదు. కానీ, చంద్ర‌బాబునాయుడు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించి ప్ర‌క్షాళ‌న చేస్తే మిన‌హా నెల్లూరు కార్పొరేష‌న్ లోని ఒక‌రిద్ద‌రు కోవ‌ర్ట్ కార్పొరేటర్ల‌ను బ‌హిష్క‌రిస్తే స‌రిపోద‌ని ఆ పార్టీకి అంకిత‌మై ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తున్న సామాన్యుల ఉవాచ.