Site icon HashtagU Telugu

Pongal – Cock Fight : కోడి పందేల సంస్కృతి ఎలా వచ్చిందంటే..?

Sankranthi Celebrations

Sankranthi Celebrations

సంక్రాంతి (Pongal ) అంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడిపందేలు (Cock Fight). ఈ కోడి పందేలకు ప్రసిద్ధి గోదావరి జిల్లాలు. సంక్రాంతి మూడ్రోజులతో పాటు అటూ ఇటూ మొత్తంగా వారం రోజులు అత్యంత ఘనంగా ఈ కోడిపందేలు జరుగుతాయి. సంక్రాంతి సమయంలో కేవలం గోదావరి జిల్లాల్లో (Godavari Districts) కోడిపందేలపై 4 వందల కోట్ల వరకూ బెట్టింగ్ జరుగుతుందంటే అర్ధం చేసుకోవాలి. లోపలి, బయటి పందేలు కలిపి 4 వందల కోట్లుంటుంది. సంక్రాంతి కోసం కాకున్నా కోడి పందేల కోసమైనా విదేశాల్ని, సుదూరం నుంచి తరలి వస్తుంటారు. కోడిపందేలు లేకుండా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి లేదంటే అతిశయోక్తి లేదు. రేయి పగలు ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో ఏదో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగినట్టు స్డేడియంలో ఈ పందేలు జరుగుతుంటాయి. భారీగా ఫ్లడ్‌లైట్ కాంతుల్లో వెలిసే పందెం బరులు, ఆ చుట్టూ వివిధ రకాల ఫుడ్ ‌స్టాల్స్..ఇవి చాలదన్నట్టుగా గుండాట వంటి ఇతర జూదాలు. ఒక్కమాటలో చెప్పాలంటే కాక్ కార్నివాల్ మాదిరి అని చెప్పొచ్చు.

Champions Trophy 2025: గ‌త ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, విరాట్ ప్రదర్శన ఎలా ఉందంటే?

మరి అలాంటి కోడి పందేల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసా..? ప్రాచీన కాలంలో యుద్ధాలు తప్పవనుకున్నప్పుడు లక్షల మంది చనిపోతారని, పౌరుషాలకు పోవద్దని పెద్దలు చెప్పేవారు. ‘తులారణం’ ప్రకారం ఇరుపక్షాల నుంచి ఒక్కో కోడిని ఎంపిక చేసి పందెం పెట్టేవారు. ఏదైతే చనిపోతుందో వారు ఓడిపోయినట్లు. దీంతో అశేష జననష్టం తప్పి శాంతి ఏర్పడుతుందని ఆనాడు కోడి పందేలను ప్రోత్సహించారు. కోడి పందేల ద్వారా పౌరుషం, ధైర్యం, పట్టుదల వంటి గుణాలను ప్రదర్శించేవారు. ఈ క్రీడను గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సవం నాడు నిర్వహించడం మొదలయింది. అప్పట్లో పందెంలో గెలుపు లేదా ఓటమి కేవలం ఒక గౌరవప్రదమైన వ్యవహారంగా మాత్రమే ఉండేది. కాలక్రమేణా, ఈ క్రీడ కేవలం పోటీకే పరిమితం కాకుండా, వినోదం, సాంస్కృతిక కార్యక్రమంగా మారింది. ఆధునిక కాలంలో కోడి పందేలు కొన్ని వివాదాలను, చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. జంతు హక్కుల పరిరక్షణ సంఘాలు, చట్టాలు ఈ క్రీడపై ఆంక్షలు విధించాయి. కోడులకు కత్తులు కట్టడం, అవి గాయపడడం వంటి అంశాలు ప్రతికూలతలను తెచ్చాయి. ఇదివరకు సామాజిక శాంతి కోసం ఉపయోగపడిన ఈ సంప్రదాయం, ఇప్పుడు వాణిజ్య లాభాల కోసం దుర్వినియోగమవుతోంది.ఇప్పటికీ కోడి పందేలు కొన్ని ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయం పేరుతో కొనసాగుతున్నాయి. దీనిని నిర్వహించే విధానంలో మార్పులు చేసుకుంటే, మన సంప్రదాయానికి చక్కటి ప్రాతినిధ్యంగా నిలుస్తాయి.