Site icon HashtagU Telugu

Tirumala : వీఐపీల‌కే శ్రీవారి వైకుంఠం

వైకుంఠ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయ‌డంపై ధార్మిక సంస్థ‌లు మండిప‌డుతున్నాయి. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులోకి రాకుండా ద‌ర్శ‌నాల‌ను ఎందుకు ర‌ద్దు చేస్తున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని ధార్మిక సంస్థ‌లు నిల‌దీస్తున్నాయి. అధికారికంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌కుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా వైకుంఠ ఏకాద‌శి ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయ‌డంపై పోరాటం చేస్తామ‌ని వీహెచ్ పీ హెచ్చ‌రిస్తోంది. వీఐపీ ద‌ర్శ‌నాల‌కు రాని క‌రోనా సామాన్య భ‌క్తుల ద‌ర్శ‌నాల‌తో ఎందుకు వ‌స్తుంద‌ని వీహెచ్ పీ ప్ర‌తినిధి రావినూత‌ల శ‌శి నిల‌దీస్తున్నాడు. వీఐపీ సిఫార‌స్సుల‌కే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం ప‌రిమితం చేయడాన్ని త‌ప్పుబట్టాడు.

దేవాలయాల వద్ద కరోనా గైడ్ లైన్స్ ఆధారంగా దర్శన ఏర్పాట్లు చేస్తామనే ఆలోచన దేవాదాయ శాఖ చేయాలి. వేలకోట్ల దేవుడి సొమ్ము జమచేసుకున్న దేవాదాయ శాఖ భక్తులకు కనీస జాగ్రత్త ఏర్పాట్లు చేసి దేవుని దర్శనం క‌ల్పించే స్థోమ‌త లేక‌పోవ‌డం దారుణం. ఇతర మతస్థుల పండుగలు, ప్రార్థనా స్థలాల వద్ద అమలు కాని నియమ నిబంధనలు దేవాలయాల వద్ద మాత్రమే ఎందుకు అమ‌లు చేస్తున్నారో..అర్థం కావ‌డంలేదు. అర్థరాత్రి వరకూ జనం గుమిగూడే వ్యాపార సంస్థలకు వర్తించని కరోనా రూల్స్ పవిత్రమైన దేవాలయాలకు వ‌ర్తింప చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

VIP దర్శనాలకు ప‌రిమిత‌మైన టీటీడీ బోర్డు సామాన్య భ‌క్తుల‌కు తిరుమల వెంకన్న స్వామిని దూరం చేస్తోంది.ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో భక్తులను నిరోధిస్తుంటే..ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ కూడా దీనిపై స్పందించ‌డంలేదు. దేశంలో లాక్‌డౌన్ కంటే ముందే TTD దర్శనాలు నిలుపుదల చేస్తే హిందూ సమాజం ప‌ల్లెత్తి మాట అన‌లేదు. గడిచిన రెండేళ్లుగా VIP ల‌కు వాళ్ల సిఫార్సులకే స్వామి వారి దర్శనాన్ని పరిమితం చేయ‌డం అత్యంత గ‌మ‌నార్హం.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన భద్రతా చర్యలు చేపట్టి భక్తులకు అన్ని దేవాలయాలలో దర్శనం ఏర్పాట్లు చేయాల‌ని వీహెచ్ పీ డిమాండ్ చేస్తోంది. దార్మిక హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేద‌ని, నిజంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ప్రభుత్వాలు భావిస్తే పూర్తిగా లాక్ డౌన్ ప్ర‌క‌టించాల‌ని కోరింది. హిందూ పండుగలు వచ్చినప్పుడు దేవాలయాల వద్దనే కరోనా రూల్స్ అమలు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. హిందూ పండుగలు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాధి కుటుంబాలకు జీవనోపాధి. కానీ, హిందూ స‌మాజంలోని ధార్మికత‌పై దెబ్బ‌కొట్ట‌డాన్ని అంద‌రూ వ్య‌తిరేకించాల‌ని వీహెచ్ పీ పిలుపునిస్తోంది.