TDP Vs YSRCP : చంద్ర‌బాబు ఇలాఖాలో పెద్దిరెడ్డి అల‌జ‌డి

చిత్తూరులోని ఓబ‌న‌ప‌ల్లి కేంద్రంగా పోలీసులకు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ న‌డుస్తోంది.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 01:00 PM IST

చిత్తూరులోని ఓబ‌న‌ప‌ల్లి కేంద్రంగా పోలీసులకు, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ న‌డుస్తోంది. మాజీ మేయ‌ర్ క‌టారి హేమ‌ల‌త అనుచరుడి ఇంటిపై పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిండంతో మొద‌లైన హైడ్రామా రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. ఈ ఎపిసోడ్ లోకి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు దిగారు. దీంతో రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ప్ర‌స్తుతం ఆ జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. కొన్ని ద‌శాబ్దాలుగా చంద్ర‌బాబు చిత్తూరు జిల్లా రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో న‌డుపుతున్నారు. ఎప్ప‌టికప్పుడు ఆయ‌న‌దే పైచేయిగా ఉండేది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రాజ‌కీయ అడుగుల‌కు బ్రేక్ లు ప‌డేవి. స్వ‌ర్గీయ వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా బాబు హ‌వా అక్క‌డ న‌డిచేది. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చిత్తూరు జిల్లా సీన్ మారిపోయింది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై కూడా పెద్దిరెడ్డి ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించుకోగ‌లిగారు. అంతేకాదు, అక్క‌డి మండ‌ల‌, జిల్లాప‌రిష‌త్ ల‌ను ఆ పార్టీ కైవ‌సం చేసుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు హ‌వాకు తాత్కాలిక బ్రేక్ ప‌డింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి చంద్ర‌బాబును ఓడిస్తామ‌ని ప‌దేప‌దే మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఆ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచే టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుల ఆప‌రేష‌న్ మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలోని చంద్ర‌బాబు అనుచ‌రులు, టీడీపీలోని కీల‌క లీడ‌ర్ల‌ను ఏదో ఒక ర‌కంగా సానుకూలంగా తిప్పుకునే ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మాజీ మేయ‌ర్ హేమ‌ల‌తతో పాటు ఆమె అనుచ‌రుల‌ను టార్గెట్ చేశార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. చిత్తూరులోని ఓబనపల్లిలో గురు, శుక్రవారాల మధ్య రాత్రి వేళ‌ల్లో నగర మాజీ మేయర్, తెలుగుదేశం నాయకురాలు కటారి హేమలత అనుచరుడి ఇంటిపై పోలీసులు త‌నిఖీలు చేశారు. ఆమె అనుచరులలో ఒకరైన పూర్ణ చంద్రను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నాన్ని ప్రతిఘటించారు. దీంతో పోలీసు వాహనం ఢీకొట్టడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని ఆమె అనుచరులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు.

తొలుత ప్రసన్నకుమార్ అనే వ్య‌క్తి నుంచి 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత‌ను ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా గురువారం అర్థరాత్రి ఓబనపల్లిలోని హేమలత అనుచరుడు పూర్ణచంద్ర ఇంటిపై పోలీసులు దాడి చేశారు. “పూర్ణ చంద్ర కాంపౌండ్‌లో రహస్యంగా నిల్వ చేసిన 18 కిలోల గంజాయిని సీజ్ చేశామ‌ని పోలీసులు చెబుతున్నారు. అందుకే, ప్ర‌స‌న్న‌, పూర్ణ‌చంద్రల‌ను అదుపులోకి తీసుకుని వ‌స్తుండ‌గా కొంతమంది వ్యక్తులు వాహనాన్ని అడ్డుకున్నార‌ని” II టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. యతీంద్ర చెబుతున్నారు.

పోలీసుల దాడిపై సమాచారం అందుకున్న మాజీ మేయ‌ర్ హేమలత అనుచరులతో కలిసి ఓబనపల్లికి చేరుకున్నారు. నిందితులు ప్ర‌స‌న్న‌, పూర్ణ‌చంద్ర‌ల‌ను తీసుకెళ్తున్న జీపును అడ్డుకున్నారు. పోలీసులు వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు మాజీ మేయర్‌పైకి దూసుకెళ్లింది. ఆమెకు ఫ్రాక్చర్ కావ‌డంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఎవ‌ర్నీ పోలీస్ వాహ‌నం ఢీ కొట్ట‌లేద‌ని సీఐ చెబుతున్నారు. నిందుతులైన ప్ర‌సన్న‌, పూర్ణ‌చంద్ర‌ల‌ను మాజీ మేయ‌ర్ టీమ్ తీసుకెళ్లింద‌ని కేసు న‌మోదు అయింది. నిందితులతో పాటు తప్పించుకున్న వ్యక్తుల బృందంపై కేసులు నమోదు చేశామని, విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నామని సీఐ యతీంద్ర తెలిపారు.

కాగా, హేమలత, ఆమె అనుచరులపై పోలీసుల చర్యను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఇతర పార్టీల నేతలు ఖండించారు. రాజ‌కీయంగా టీడీపీ నేత‌ల‌పై వైసీపీ చేస్తోన్న దాడులుగా భావిస్తోంది. పోలీసుల‌ను ఉప‌యోగించుకుని మంత్రి పెద్దిరెడ్డి దుర్మార్గ‌పు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద టీడీపీ మాజీ మేయ‌ర్ క‌టారి వ్య‌వ‌హారం ఇప్పుడు బాబు, పెద్దిరెడ్డి మ‌ధ్య సాగుతోన్న రాజ‌కీయ వార్‌కు మ‌రింత ఆజ్యం పోసింది.