Site icon HashtagU Telugu

YS Viveka Case : వివేకా హత్యకేసు : భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

High court reserve result for bail in Ys Vivekananda Reddy case

High court reserve result for bail in Ys Vivekananda Reddy case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యకేసులో నిందితులుగా ఉన్న శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై గురువారం సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. మరో నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్యకేసులో నిందితులైన మరో ఇద్దరు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం వాదనలు పూర్తయ్యాయి. వీరి బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

వైఎస్ వివేకా హత్యకేసులో అసలు నిందితులెవరో ఇంతవరకూ సీబీఐ(CBI) తేల్చలేకపోయింది. ఎవరి నుంచి ఫోన్ వస్తే.. ఎవరు ఆయన్ను చంపారన్నది ఇప్పటికీ మిస్టరీనే. వివేకాను ఆస్తి కోసం చంపారా ? లేక రాజకీయ హత్య? ఇందులో మరేదైనా కుట్రదాగుందా ? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో ఎంపీ అవినాషే అసలైన నిందితుడని రెండునెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఇక సీబీఐ అతడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరచడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో.. తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్నారు.

అవినాష్ రెడ్డి బెయిల్ విచారణ సందర్భంలోనే.. సీబీఐ ఈ కేసులో ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కు కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపించింది. ఈ వాదనలను తెలంగాణ హైకోర్టు కొట్టిపారేసింది. అందుకు తగిన సాక్ష్యాలు లేకుండా.. మొదటి నుంచి లేని వ్యక్తి పేరును ఇప్పుడు ఛార్జిషీటులో చేర్చడం ఏంటని మొట్టికాయలు వేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ విషయంలో కూడా హైకోర్టు పట్టువీడటం లేదు. ఆయన బెయిల్ పై బయటికెళ్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. మరి ఈ సారి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Also Read : CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్