Andhra Pradesh: శ్రీలక్ష్మి పిటిషన్ పై.. వ్యంగంగా స్పందించిన‌ హైకోర్టు

  • Written By:
  • Publish Date - March 5, 2022 / 12:41 PM IST

అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జ‌స్టిస్ ఎమ్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, జ‌స్టిస్ డి.వి.వి. సోమ‌యాజులు తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం రాజకీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘తెలుగు రాష్ట్రాల్లో నీతికి, నిజాయితీకి పేరున్న సిన్సియర్ సీనియర్ మోస్ట్ అధికారి’ అంటూ జగన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి వై శ్రీ లక్ష్మి మీద హైకోర్టు వ్యాఖ్య చేస్తూ, ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం అని, ఆమె చేసిన పనులు అందరికీ తెలుస్తూ అంటూ, వ్యంగంగా హైకోర్టు స్పందించింది. రాజ‌ధాని అంశానికి సంబంధించిన కేసు నుంచి న్యాయమూర్తులు తప్పుకోవాల‌ని ఏపీ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటిష‌న్ పై, తాజాగా హైకోర్టు సంధించిన ప్రశ్నలు కూడా ఆసక్తిగా ఉన్నాయి.

“ఇద్దరు జడ్జీలకు అమరావతిలో భూములు ప్రభుత్వం ఇచ్చిందని అంటున్నారని, నిజానికి వారు మార్కెట్ వేల్యూ ప్రకారమే, అక్కడ 30 లక్షల పెట్టి కొనుక్కున్నారని తెలిపారు. వీరితో పాటు 14 జడ్జిలకు అక్కడ భూములు ఇచ్చారని తెలిపారు. వీరికే కాకుండా, వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు, ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు కూడా అక్కడ భూములు కేటాయించారని, ఇందులో త‌ప్పుప‌ట్టాల్సిన విష‌యం ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

జడ్జీలకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. జడ్జీలకు కార్లు, ఇళ్లు వంటి సదుపాయాలు కల్పించేది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు జడ్జీలు కూర్చునే కుర్చీని, సంతకం పెట్టే పెన్నుని కూడా సప్లై చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. అందుకని ప్రభుత్వ వ్యవహారాల్లో జడ్జీలకు ఆర్ధిక పరమైన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని అనుకోవాలా ?” అంటూ హైకోర్టు స్పందించింది. జడ్జీలకు ఇళ్ళ కేటాయింపు ఎలా జరిగిందో కూడా చూడకుండా, ఈ పిటీషన్ వేయటం, జడ్జిల మీద బురద చల్లటానికే అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ పిటీషన్ వేయటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అర్ధం అవుతుంది అంటూ, హైకోర్టు వ్యాఖ్యానించింది. “bench hunting tactics” అనేవి ప్రైవేటు పార్టీలు చేయటం చూసామని, మొదటి సారి ఒక ప్రభుత్వమే ఇలా చేయటం చూస్తున్నాం అని అన్నారు. మొత్తం మీద హైకోర్టు వ్యవహరించిన తీరు, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇష్టం వచ్చినట్టు కోర్టుల పైన కామెంట్స్ చేస్తున్న ప్రభుత్వానికి, సుతి మెత్తగా హెచ్చరికలు పంపించింది. మ‌రి హైకోర్టు వ్యంగ్య వ్యాఖ్య‌ల‌పై ఏపీ స‌ర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.