Site icon HashtagU Telugu

CM Chandrababu: పీ4 కార్యక్రమం.. సీఎం చంద్ర‌బాబు మ‌రో కీల‌క పిలుపు!

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) తన మనసుకు అత్యంత దగ్గరైన కార్యక్రమంగా “జీరో పావర్టీ పీ4″ను అభివర్ణించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ‘మార్గదర్శుల’కు సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో తన ఆలోచనలు, లక్ష్యాలను పంచుకున్నారు.

సీఎం ఆలోచనలు, లక్ష్యాలు

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది ‘బంగారు కుటుంబాలను’ మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అంబేద్కర్ నుండి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎవరో ఒకరి సాయం అందిందని గుర్తు చేశారు. సమాజంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలని సూచించారు. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఉదహరించారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నానని, ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షల ‘బంగారు కుటుంబాలను’ గుర్తించామని, వారికి సాయం చేసేందుకు 47 వేల మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read: Donald Trump: ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో 5 విమానాలు ధ్వంసమ‌య్యాయి: ట్రంప్‌

నాడు జన్మభూమి.. నేడు పీ4

47 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విడత సంస్కరణలు తీసుకువచ్చి, ఐటీ, విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు అన్నారు. ఇవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, సంపద సృష్టించగలిగామని తెలిపారు. దీని ద్వారా సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని చెప్పారు. ‘జన్మభూమి’ వంటి కార్యక్రమం ద్వారా గతంలో అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేశామని గుర్తు చేస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. పేదల భవిష్యత్ బంగారుమయం చేసేందుకు ‘పీ4’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం వివరించారు.

సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు మార్గదర్శులు ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు, ఆశయాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేదల కోసం ఇంతగా ఆలోచించిన నాయకుడిని గతంలో తామెప్పుడూ చూడలేదని కొనియాడారు.